Begin typing your search above and press return to search.

ఇది పోతే.. తట్టా బుట్టా సర్దుకోవచ్చు

By:  Tupaki Desk   |   12 Aug 2018 10:00 AM IST
ఇది పోతే.. తట్టా బుట్టా సర్దుకోవచ్చు
X
ఏ రంగంలో అయినా సక్సెస్ సాధించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం కీలకం. సినీ పరిశ్రమలో ఇది మరింత ముఖ్యమైన విషయం. సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉండే ఈ పరిశ్రమలో విజయాన్ని నిలబెట్టుకోవడం అంత సులువు కాదు. అందులోనూ తమ చేతుల్లో ఏమీ లేని హీరోయిన్లు విజయవంతంగా కెరీర్లను కొనసాగించడం అంత సులువు కాదు. ఒకట్రెండు విజయాలొచ్చాయని పొంగిపోతే.. అంతలోనే పరాజయాలు పలకరిస్తాయి. పరాజయ పరంపర కొనసాగితే ఐరెన్ లెగ్ ముద్ర వేసి ఇండస్ట్రీ నుంచి సాగనంపేస్తారు. మలయాళ భామ అను ఇమ్మాన్యుయెల్ ఇప్పుడు అలాంటి ప్రమాదంలోనే ఉంది. ‘మజ్ను’ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ భామ.. చాలా త్వరగా స్టార్ హీరోయిన్ అయింది. పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టార్లతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది.

కానీ ఏం లాభం.. వాళ్లతో చేసిన ‘అజ్ఞాతవాసి’.. ‘నా పేరు సూర్య’ పెద్ద డిజాస్టర్లయ్యాయి. దీనికి ముందు అను నుంచి వచ్చిన సినిమాలు కూడా చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ఆమెకు ఆల్రెడీ ఫ్లాప్ హీరోయిన్ అనే ట్యాగ్ వచ్చేసింది. ఇప్పుడు అను ఆశలన్నీ ‘శైలజా రెడ్డి అల్లుడు’ మీదే ఉన్నాయి. ఇప్పుడు తెలుగులో ఆమె నటించిన ఏకైక సినిమా ఇదే. రవితేజ సరసన చేయాల్సిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ కూడా ఆమె చేజారింది. ‘శైలజా రెడ్డి అల్లుడు’ ఆడితే ఇంకేదైనా అవకాశం రావచ్చేమో. ఇది కనుక ఫ్లాప్ అయితే మాత్రం అను తట్టా బుట్టా సర్దుకుని టాలీవుడ్ నుంచి నిష్క్రమించడం తప్ప మరో మార్గం లేదు. ఐతే మంచి సక్సెస్ రేట్ ఉన్న మారుతి మీద భరోసాతోనే ఉంది అను. ఈ చిత్ర ప్రోమోలు కూడా పాజిటివ్ ఫీలింగ్ తెస్తున్నాయి. మరి ఈ నెల 31న అను భవితవ్యం ఏమవుతుందో చూడాలి.