Begin typing your search above and press return to search.

మల్లువుడ్ అర్జున్ రెడ్డి ఎవరు?

By:  Tupaki Desk   |   16 Sept 2018 12:40 PM IST
మల్లువుడ్ అర్జున్ రెడ్డి ఎవరు?
X
గత ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలవడమే కాక సెన్సేషన్ కు పర్యాయపదంగా నిలిచిన అర్జున్ రెడ్డి ఇతర భాషల్లోనూ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో సందీప్ రెడ్డి వంగానే దర్శకుడిగా షాహిద్ కపూర్ తో రీమేక్ చేస్తుండగా గుబురు గెడ్డం కోసం వెయిట్ చేస్తున్న షాహిద్ ఈ నెలాఖరు నుంచి షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఇక తమిళ్ లో బాలా దర్శకత్వంలో వర్మ టైటిల్ తో విక్రమ్ కొడుకు ధృవ్ తో చేస్తున్న రీమేక్ కూడా త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకోబోతోంది. కన్నడలో యష్ ని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అవి ఒక కొలిక్కి రావడానికి ఇంకా టైం పడుతుందని టాక్. ఇక సౌత్ లో మిగిలింది మలయాళం. ఇప్పుడు దానివైపు కూడా అడుగులు చకచకా పడుతున్నాయి. ఈఫోర్ఈ అనే నిర్మాణ సంస్థ వద్ద హక్కులు ఉన్నాయి. అర్జున్ రెడ్డి ఒరిజినల్ వెర్షన్ సైతం కేరళలో బాగా ఆడింది. ఇప్పుడు దీంట్లో టైటిల్ ఎవరు చేస్తారు అనేదే ఆసక్తికరంగా మారింది.

రఫ్ గా కనిపించే యారొగెంట్ డాక్టర్ పాత్రకు అంటోని వర్గీస్ తో పాటు నివిన్ పౌలి పేర్లు పరిశీలనలో ఉన్నాయట. బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను బాగా ఆదరించే కేరళలో అర్జున్ రెడ్డి లాంటి పాత్రలు బాగా కనెక్ట్ అయిపోతాయి. మరి కుర్రకారులో మంచి క్రేజ్ ఉన్న ఈ ఇద్దరిలో ఎవరు చేసినా ఖచ్చితంగా వర్క్ అవుట్ అవుతుంది. దుల్కర్ సల్మాన్ పేరు కూడా అనుకున్నారు కానీ ఇప్పుడతను స్టార్ హీరో. ఇలాంటి సబ్జెక్టు కు మీడియం రేంజ్ ఉన్న హీరో అయితేనే బాగుంటుంది అని భావించి దానికి తగ్గట్టే చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మొత్తానికి బాషా భేదం లేకుండా కీలకమైన భారతీయ భాషల్లోకి రీమేక్ అవుతున్న తెలుగు సినిమా ఈ మధ్య కాలంలో ఇదే అని చెప్పొచ్చు. ఆల్రెడీ పెళ్లి చూపులు సైతం ఇలాగే మూడు భాషల్లో తెరకెక్కింది. అర్జున్ రెడ్డి ఓ ఆకు ఎక్కువ చదివి ఐదు భాషల్లో తయారవుతోంది. కంటెంట్ ఉన్నప్పుడు బాషభేదాలు ఎందుకు వస్తాయి. దానికి ఉదాహరణగా అర్జున్ రెడ్డినే చెప్పుకోవచ్చు.