Begin typing your search above and press return to search.

వివేక్ సాగర్ పెళ్లిలో సుందరం టీమ్ సందడి!

By:  Tupaki Desk   |   17 Nov 2021 7:30 AM GMT
వివేక్ సాగర్ పెళ్లిలో సుందరం టీమ్ సందడి!
X
టాలీవుడ్ కి సంబంధించి ఒకప్పుడు ఇద్దరు .. ముగ్గురు సంగీత దర్శకుల పేర్లు మాత్రమే వినిపిస్తూ ఉండేవి. అలాంటిది ఇప్పుడు కొత్త సంగీత దర్శకులు వరుసగా తెలుగు తెరకి పరిచయమవుతున్నారు. తెలుగు సినిమా పాటను కొత్త దారుల్లో .. కొత్త తీరుల్లో పరుగులు తీయిస్తున్నారు.

మణిశర్మ .. దేవిశ్రీ ప్రసాద్ .. తమన్ స్టార్ హీరోల సినిమాలతో తమ దూకుడు చూపుతున్నారు. ఇక ఆ తరువాత వరుసలో గోపీసుందర్ .. మిక్కీ జె మేయర్ .. అనూప్ రూబెన్స్ దూసుకుపోతున్నారు.

ఈ నేపథ్యంలోనే విశాల్ చంద్రశేఖర్ .. వివేక్ సాగర్ .. చైతన్ భరద్వాజ్ తమదైన ముద్ర వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నారు. వివేక్ సాగర్ విషయానికి వస్తే మొదటి నుంచి కూడా ప్రత్యేకమైన బాణీలను స్వరపరుస్తూ వస్తున్నాడు.

ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని మంచి పాటలను ఆవిష్కరిస్తున్నాడు. 'పెళ్లి చూపులు' .. 'సమ్మోహనం' .. 'బ్రోచేవారెవరురా' .. 'రాజా రాజా చోర' సినిమాలకు ఆయన అందించిన సంగీతం మంచి పేరును తెచ్చిపెట్టింది.

హైదరాబాద్ లో నిన్న ఆయన వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు బంధువులు .. సన్నిహితులు హాజరయ్యారు. అలాగే 'అంటే .. సుందరానికీ!' టీమ్ కూడా హాజరైంది. నాని హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకి వివేక్ సాగర్ పనిచేస్తున్నాడు.

అందువలన నానితో పాటు ఈ సినిమా టీమ్ అంతా కూడా ఈ వివాహ వేడుకకు హాజరై సందడి చేసింది. ఈ సందర్భంగా వివేక్ సాగర్ కి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనసును దోచే మరిన్ని పాటలు ఆయన నుంచి రావాలని కోరుకుందాం. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కేటగిరీలోకి సాధ్యమైనంత త్వరగా చేరిపోవాలని ఆశిద్దాం.

ఇక 'అంటే సుందరానికీ!' సినిమా విషయానికి వస్తే, మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, టైటిల్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. 'బ్రోచేవారెవరురా' హిట్ తరువాత ఆయన రూపొందిస్తున్న సినిమా కావడంతో, సహజంగానే అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాతో మలయాళ మనోహరి నజ్రియా నజీమ్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. విశాలమైన కళ్లతో వీలైనన్ని మనసులు దోచిన నజ్రియా, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ కానుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.