Begin typing your search above and press return to search.

ఓటీటీ బాట పట్టనున్న నాని మరో సినిమా!?

By:  Tupaki Desk   |   1 Sep 2021 2:30 AM GMT
ఓటీటీ బాట పట్టనున్న నాని మరో సినిమా!?
X
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రెండు సినిమాలను డైరెక్ట్ ఓటీటీ వేదికగా విడుదల చేసే పరిస్థితి తీసుకొచ్చింది కరోనా మహమ్మారి. గతేడాది లాక్ డౌన్ సమయంలో నాని సిల్వర్ జూబ్లీ మూవీ ''వి'' ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ వేవ్ ప్రభావం వల్ల 'టక్ జగదీష్' చిత్రాన్ని కూడా డిజిటల్ ఫ్లాట్ ఫారమ్ లో స్ట్రీమింగ్ కి పెట్టాల్సి వచ్చింది. వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10న ఈ సినిమా అమెజాన్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు నాని నుంచి మరో సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

కాకపోతే ఈసారి నాని హీరోగా నటించిన సినిమా కాకుండా.. తన ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారట. వివరాల్లోకి వెళ్తే.. వాల్‌ పోస్ట‌ర్ సినిమా బ్యానర్ పై నిర్మాత ప్రశాంతి తిపిర్నేని తో కలిసి నాని ''మీట్ క్యూట్'' అనే సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. నాని సోదరి దీప్తి ఘంటా ఈ చిత్రంతో డైరెక్టర్‌ గా పరిచయం అవుతోంది. మహిళా ప్రధానంగా సాగే ఈ ఆంథాలజీలో ఐదు కథలను చెప్పబోతున్నారు. ఇందులో ఆరుగురు మేల్ - ఆరుగురు ఫీమేల్ లీడ్ యాక్టర్స్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

అయితే 'మీట్ క్యూట్‌' చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ రుహానీ శర్మ లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం విడుదల కానున్న 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రుహాని మాట్లాడుతూ.. తెలుగులో తన తదుపరి సినిమా 'మీట్ క్యూట్' చాలావరకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుందని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఆంథాలజీలకు ఓటీటీలు సరైన వేదిక అని చెప్పవచ్చు. రెండు సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న నాని బ్రాండ్ వాల్యూ.. 'మీట్ క్యూట్' డిజిటల్ రైట్స్ అమ్ముడుపోవడంలో హెల్ప్ అవుతాయి. మరి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ పై నాని క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

కాగా, 'మీట్ క్యూట్' చిత్రంలో రోహిణి - అదా శర్మ - వర్ష బొల్లమ్మ - ఆకాంక్ష సింగ్ - రుహాని శర్మ - సునయన - సంచిత పూనచ మహిళా ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. అశ్విన్ కుమార్ - శివ కందుకూరి - దీక్షిత్ శెట్టి - గోవింద్ పద్మసూర్య మరియు రాజా మేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం సమకూరుస్తుండగా.. వసంత కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఇకపోతే నాని 'టక్ జగదీష్' ట్రైలర్ ను బుధవారం విడుదల చేస్తున్నట్లు నాని ప్రకటించారు.