Begin typing your search above and press return to search.

ఈవారం థియేటర్లలోకి మరో అర డజను సినిమాలు..!

By:  Tupaki Desk   |   31 Aug 2021 7:00 AM IST
ఈవారం థియేటర్లలోకి మరో అర డజను సినిమాలు..!
X
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తర్వాత థియేటర్లు తెచుకోవడంతో చిన్న సినిమాలన్నీ రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. సినిమా హాళ్లు తెరుచుకొని నెల దాటిపోయినా పెద్ద సినిమాలను, క్రేజీ ఉన్న మీడియం రేంజ్ చిత్రాలను విడుదల చేయడానికి మేకర్స్ ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు థియేటర్లలో సందడి చేసినవన్నీ చిన్న సినిమాలు చిన్న హీరోల సినిమాలు. ప్రతీ వారం అర డజను చొప్పున ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ శుక్రవారం మరో ఆరు చిత్రాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!

అవసరాల శ్రీనివాస్‌ - రుహానీ శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ''నూటొక్క జిల్లాల అందగాడు''. బ‌ట్ట‌త‌ల ఉన్న వ్యక్తి ఓ అమ్మాయి ప్రేమ కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది వినోదాత్మ‌కంగా చూపించ‌బోతున్నారు. అగ్ర దర్శకనిర్మాతలు క్రిష్ జాగర్లమూడి - దిల్‌ రాజు సమర్పిస్తున్న సినిమా కావడంతో అందరి దృష్టి దీనిపై పడింది. రాచకొండ విద్యాసాగర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శిరీష్‌ - రాజీవ్‌ రెడ్డి - సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. సెప్టెంబరు 3న థియేటర్‌లలో విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

మేఘా ఆకాష్‌ - అరుణ్‌ అదిత్‌ - అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్రల్లో రూపొందించిన చిత్రం ''డియర్‌ మేఘ''. సుశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అర్జున్‌ దాస్యన్‌ నిర్మించారు. ఫీల్ గుడ్ అండ్ ముక్కోణపు ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా సెప్టెంబర్‌ 3నే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ట్రైలర్ - పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఏషియన్ సినిమాస్ ద్వారా 300లకు పైగా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌' ప్రాంఛైజీలో తొమ్మిదో సినిమా ''ఎఫ్ 9'' ను కూడా ఈ శుక్రవారమే భారతీయ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యాక్షన్‌ సినీ ప్రియులను విశేషంగా అలరించిన ఈ సినిమాలకు ఇక్కడ కూడా క్రేజ్ ఉంది. 'ఎఫ్ 8' ఇండియాలో భారీ వసూళ్ళు రాబట్టడమే దీనికి నిదర్శనం. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా వచ్చిన F9 ఇప్పటికే అంతర్జాతీయంగా కాసుల వర్షం కురిపిస్తోంది. సెప్టెంబరు 3న ఈ చిత్రం తెలుగు హిందీ ఇంగ్లీష్ లతో పాటు పలు భారతీయ భాషల్లోనూ రిలీజ్ కానుంది.

ఇదే క్రమంలో 'ది కిల్లర్‌' అనే క్రైమ్ థ్రిల్లర్ - 'అప్పుడు ఇప్పుడు' అనే కామెడీ ఎంటర్టైనర్ - 'అశ్మీ' అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రాలు సెప్టెంబర్ 3న థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ వారం రిలీజ్ అవుతున్న చిత్రాల్లో '101 జిల్లాల అందగాడు' 'డియర్ మేఘ' సినిమాలకు మాత్రమే అంతో ఇంతో క్రేజ్ ఉంది. మరి ఈ అర డజను చిత్రాల్లో ఏవి ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి.