Begin typing your search above and press return to search.

టాలీవుడ్లో విషాదం.. క‌రోనాతో మ‌రో ద‌ర్శ‌కుడు మృతి

By:  Tupaki Desk   |   30 April 2021 9:18 PM IST
టాలీవుడ్లో విషాదం.. క‌రోనాతో మ‌రో ద‌ర్శ‌కుడు మృతి
X
క‌రోనా మ‌హావిల‌యం కొన‌సాగుతూనే ఉంది. వారూవీరూ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల‌ ప్ర‌జ‌ల‌ను బ‌లితీసుకుంటోంది. ఇటు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌లువురు ప్ర‌ముఖుల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న ఈ మ‌హ‌మ్మారి.. తాజాగా మ‌రో ద‌ర్శ‌కుడిని బ‌లితీసుకుంది.

శుక్ర‌వారం ఉద‌యమే కేవీ ఆనంద్ క‌న్నుమూశారు. సాయంత్రం.. మ‌రో ద‌ర్శ‌కుడు కుమార్ వ‌ట్టి ప్రాణాలు కోల్పోయారు. యువ హీరో శ్రీవిష్ణు క‌థానాయ‌కుడిగా వ‌చ్చిన ‘మా అబ్బాయి’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు కుమార్ వట్టి.

కొన్ని రోజుల క్రితమే కరోనా బారిన పడిన ఆయన.. చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల నుంచి పరిస్థితి విషమంగా మారడంతో శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కుమార్ వయసు కేవలం 39 సంవత్సరాలు.

శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటకు చెందిన కుమార్.. చాలా కాలం క్రితమే ఇండస్ట్రీకి వచ్చారు. దర్శకుడు పరశురామ్ వద్ద సహాయకుడిగా ఉన్నారు. ఆంజ‌నేయులు, సారొచ్చారు, సోలో వంటి చిత్రాలకు ప‌నిచేశారు. ఆ త‌ర్వాత ఎడిట‌ర్ మార్తాండ్ కె.వెంక‌టేష్ వ‌ద్ద అసిస్టెంట్ గా దాదాపు 35 సినిమాల‌కు వ‌ర్క్ చేశారు. ఆ త‌ర్వాత 2017లో ద‌ర్శ‌కుడిగా మారారు.

కుమార్ వ‌ట్టి మ‌రో చిత్రం కోసం క‌థ కూడా సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇలాంటి త‌రుణంలోనే ఈ విషాదం చోటు చేసుకోవ‌డం దారుణం. కుమార్ మృతిప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.