Begin typing your search above and press return to search.

మరో వివాదంలో మహానటి

By:  Tupaki Desk   |   2 Jun 2018 10:31 AM IST
మరో వివాదంలో మహానటి
X
తెలుగు ప్రేక్షకులంతా ఎంతో అభిమానించే సావిత్రి జీవిత గాథతో మహానటి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. సావిత్రి జీవితంలోని చూసిన ఎత్తుపల్లాలన్నింటినీ సజీవంగా కళ్లముందు నిలిపాడు. సావిత్రిగా కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉందనే గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ రికార్డు స్థాయి కలెక్షన్లు కొల్లగొడుతోంది.

అందరికీ తెలిసిన వ్యక్తుల బయోపిక్ తీయడం అంత సామాన్యమైన విషయమేం కాదు. ఏదో ఒక విషయంలో వివాదాలు తలెత్తడం మామూలే. ఇందుకు మహానటి మినహాయింపు ఏమీ కాదు. ఇప్పటికే జెమినీ గణేశన్ పెద్ద భార్య కుమార్తె తన తండ్రి గురించి తప్పుగా చూపించారంటూ ఫైరయింది. తాజాగా సావిత్రి పెదనాన్న కె.వి.చౌదరి సోదరుడి మనవరాలినంటూ విజయ అనే మహిళ మహానటి సినిమాపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ సినిమాలో చౌదరి పాత్రను మంచివాడిగా చూపించారని.. కానీ ఆయన షోమాన్ అని.. తాగుబోతు అని ఆరోపించింది. సావిత్రికి మద్యం అలవాటవడానికి కారణం అలాంటి వ్యక్తి పెంపకంలో పెరగడమూ ఒక కారణమని చెప్పుకొచ్చింది.

దీంతోపాటు సావిత్రి కుమార్తె చాముండేశ్వరి తీరును విజయ తప్పుపట్టింది. సావిత్రి కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు ఆస్తి కోసం కన్నతల్లిపైనే కేసు వేసి కోర్టుకు లాగిందని.. తల్లి చివరి రోజుల్లో ఆమెను పట్టించుకోనే లేదంటూ ఆరోపణలు చేసింది. ఈ విషయాలను మహానటి టీం పట్టించుకోలేదన్నది విజయ అభ్యంతరం. ఈ ఆరోపణలను సావిత్రి కుమార్తె చాముండేశ్వరి వద్ద ప్రస్తావిస్తే తనకు తెలియని వ్యక్తులు చేసే కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కొట్టిపారేశారు.