Begin typing your search above and press return to search.

మరో భారీ డీల్.. ‘గర్జించే సింహం’.. అమెజాన్ ట్రాలీలోకి

By:  Tupaki Desk   |   27 May 2021 4:36 AM GMT
మరో భారీ డీల్.. ‘గర్జించే సింహం’.. అమెజాన్ ట్రాలీలోకి
X
ఒక దిగ్గజాన్ని మరో దిగ్గజం సొంతం చేసుకుంటే? ఇప్పుడు అలాంటి డీల్ కార్పొరేట్ ప్రపంచంలో అందరిని ఆకర్షిస్తోంది. ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్.. సినిమా నిర్మాణ దిగ్గజం ఎంజీఎం (సినిమా ప్రారంభంలో గర్జించే సింహం) సంస్థ మధ్య ఒక డీల్ ఫైనల్ అయినట్లుగా చెబుతున్నారు. ఎంజీఎంను అమెజాన్ కొనుగోలు చేయనుంది. దీని విలువ ఏకంగా 8.45 బిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. తాజా కొనుగోలుతో తన వీడియో స్ట్రీమింగ్ సర్వీసుల్ని మరింత పటిష్టం చేయాలన్నదే అమెజాన్ లక్ష్యమని చెబుతున్నారు.

నాలుగేళ్ల క్రితం (2017లో) నిత్యవసరాల చెయిన్ హోల్ ఫుడ్స్ ను 14 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన తర్వాత.. ఆ సంస్థ కొనుగోలు చేసిన పెద్ద డీల్ ఇదే కావటం గమనార్హం. వినోద రంగంలో నెట్ ఫ్లిక్స్.. డిస్నీ ప్లస్ లాంటి స్ట్రీమింగ్ సేవల సంస్థలతో పోటీకి తాజా కొనుగోలు సాయం చేస్తుందని చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం అమెజాన్ స్ట్రీమింగ్ లో 20 కోట్ల మంది ప్రైమ్ సభ్యులు ఉన్నట్లు చెబుతారు.

తాజా కొనుగోలుతో రాకీ.. రోబో కాప్.. పింక్ పాంథర్ లాంటి పలు హిట్ సినిమాలు.. షోలు అమెజాన్ కు సొంతం కానున్నాయి. ఎపిక్స్ అనే కేబుల్ చానల్ సైతం సొంతం కానుంది. బాండ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఎంజీఎంను కొనుగోలు చేయటం ద్వారా అమెజాన్ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. నిజానికి అమెజాన్ కు సొంతంగా స్టూడియో ఉంది. కానీ.. దాని ఫలితాలు మిశ్రంగా ఉన్నాయి. తాజా కొనుగోలుతో పరిస్థితి మారుతుందన్న అంచనా ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.