Begin typing your search above and press return to search.

సుమలో మరో యాంగిల్ చెప్పిన మహిళా నిర్మాత

By:  Tupaki Desk   |   27 Jan 2022 5:49 AM GMT
సుమలో మరో యాంగిల్ చెప్పిన మహిళా నిర్మాత
X
తెలుగునాట యాంకరింగ్ అన్నంతనే గుర్తుకొచ్చే పేర్లు కొన్నే ఉంటాయి. మహిళల విషయానికి వస్తే సుమకు తిరుగులేదు. అదెలాంటి ప్రోగ్రాం అయినా సరే.. సుమ యాంకరింగ్ చేస్తే ఆ సందడి.. నిండుతనం వేరని చెబుతారు. ఓపక్క యాంకరింగ్ మరోవైపు షుటింగ్ లు.. ఇంకోవైపు ప్రోగ్రాంలు ఇలా బిజీబిజీగా ఉంటారామె. అలాంటి యాంకర్ సుమకు సంబంధించి ఎప్పుడూ బయటకురాని ఒక కొత్త విషయంతాజాగా వెల్లడైంది. అదెలానంటే..

కీర్తి సురేశ్ లీడ్ రోల్ గా చేస్తున్న గుడ్ లక్ సఖి మూవీకి నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని సమర్పిస్తున్నారు. దీనికి శ్రావ్య వర్మ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రిరీలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ సందర్భంగా శ్రావ్య వర్మ మాట్లాడుతూ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. తమది చిన్న సినిమానే అయినప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరికి వారు తమ వంతు సాయం చేయటానికి ముందుకు వస్తున్నారని చెబుతూ.. మెగాస్టార్ చిరంజీవిని ఈ కార్యక్రమానికి రావాలని కోరితే వస్తానని చెప్పారని.. అనుకోకుండా కొవిడ్ కారణంగా రాలేకపోయారని చెప్పారు. అయినప్పటికీ రామ్ చరణ్ ను పంపారన్నారు.

ఇక.. యాంకర్ సుమ.. తమ సినిమా గురించి తెలిసినంతనే వస్తానని చెప్పారని.. ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా ప్రిరిలీజ్ ఈవెంట్ కు వచ్చి సినిమాను సపోర్టు చేశారన్నారు. ఒక్కోకార్యక్రమానికి లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే సుమ.. చిన్న సినిమాకు తన వంతు సాయంగా నిలిచిన వైనానికి థ్యాంక్స్ చెప్పారు.

దీంతో కలుగజేసుకున్న సుమ.. శ్రావ్య స్పీచ్ ను ముగించి వెళ్లే వేళలో..‘‘ఇంకాసేపు ఉంటే నా ఆస్తి వివరాల్ని కూడా చెప్పేలా ఉన్నావే. తర్వాత సినిమాలు చేస్తావ్ కదా. అప్పుడు అన్ని కలిపి తీసుకుంటానులే’ అంటూ వ్యాఖ్యానించి అందరిని నవ్వించేసింది. తన గురించి చెప్పిన గొప్ప గురించి పక్కకు తప్పించేలా చేసిన ఆమె చతురత ఒక ఎత్తు అయితే.. స్టార్ యాంకర్ స్టేటస్ లో ఉండి కూడా చిన్న సినిమాకు తన వంతు సాయం చేసిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. ఒక్కో ప్రోగ్రాంకు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలిసినా.. ఇలా త్యాగాలు కూడా చేస్తుందన్న విషయం మాత్రం తాజాగా బయటకు వచ్చిందని చెప్పాలి. ఏమైనా.. సుమ పెద్ద మనసుకు థ్యాంక్స్ చెప్పాల్సిందే.