Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : అన్నీ మంచి శకునములే

By:  Tupaki Desk   |   18 May 2023 11:33 PM IST
మూవీ రివ్యూ : అన్నీ మంచి శకునములే
X
'అన్నీ మంచి శకునములే' మూవీ రివ్యూ
నటీనటులు: సంతోష్ శోభన్-మాళవిక నాయర్-రావు రమేష్-రాజేంద్ర ప్రసాద్-నరేష్-గౌతమి- వెన్నెల కిషోర్-వాసుకి-ఝాన్సీ-తాగుబోతు రమేష్-షావుకారు జానకి తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి-రిచర్డ్ ప్రసాద్
స్క్రీన్ ప్లే: దావూద్
మాటలు: లక్ష్మీభూపాల్
నిర్మాణం: స్వప్న సినిమాస్-మిత్రవ్రింద మూవీస్
కథ-దర్శకత్వం: నందిని రెడ్డి

అలా మొదలైంది, కళ్యాణ వైభోగమే, ఓ బేబీ లాంటి చిత్రాలతో తన అభిరుచిని చాటిన దర్శకురాలు నందిని రెడ్డి. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా ఆమె రూపొందించిన కొత్త సినిమా 'అన్నీ మంచి శకునములే' చక్కటి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.


కథ:

హిల్ స్టేషన్లో ఉండే విక్టోరియాపురం అనే చిన్న పట్టణంలో ఒకే రోజు పుట్టిన రిషి (సంతోష్ శోభన్).. ఆర్య (మాళవిక నాయర్) హాస్పిటల్లో జరిగిన తప్పిదం వల్ల.. వేర్వేరు ఇళ్లకు వెళ్లిపోతారు. ఆ తప్పిదాన్ని కొంచెం ఆలస్యంగా గుర్తించినప్పటికీ.. డాక్టర్ చెప్పకుండా దాచి పెడుతుంది. రిషి.. ఆర్య కుటుంబాల మధ్య ఆస్తి గొడవలు.. కోర్టు కేసులు ఉన్నప్పటికీ.. వీళ్లిద్దరూ కలిసి ఒకే స్కూల్లో చదువుతూ స్నేహితుల్లా పెరిగి పెద్దవుతారు. ఈ క్రమంలో చిన్నతనం నుంచే ఆర్యను రిషి ఇష్టపడినప్పటికీ.. ఎప్పుడూ బయటపడడు. ఒక బిజినెస్ ట్రిప్ లో భాగంగా ఇద్దరూ యూరప్ వెళ్లి అక్కడ జరిగిన ఓ గొడవతో ఒకరికొకరు దూరం అవుతారు. ఆపై ఆర్య.. వేరే అబ్బాయిని ఇష్టపడుతుంది. రెండేళ్ల విరామం తర్వాత ఈ ఇద్దరూ కలవాల్సిన పరిస్థితి వస్తుంది. మరీ ఈ ప్రయాణంలో రిషి-ఆర్యల బంధం ఎలాంటి మలుపు తీసుకుంది.. రెండు కుటుంబాల మధ్య ఆస్తి గొడవలు ఏమయ్యాయి.. వీళ్లిద్దరి జన్మరహస్యం బయటపడిందా లేదా.. ఈ విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.


కథనం-విశ్లేషణ:

కొత్త కథలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే సినిమాలు కొన్నయితే.. కథ పాతగా అనిపించినా కథనంతో మ్యాజిక్ చేసే సినిమాలు కొన్ని. అన్నీ తెలిసిన సన్నివేశాలే అయినా ఆహ్లాదంగా అనిపిస్తూ.. ప్రేక్షకులను 'ఫీల్ గుడ్' మూడ్ లో ఉంచుతూ ముందుకు తీసుకెళ్తాయి రెండో రకంలో కొన్ని కథలు. 'అన్నీ మంచి శకునములే' ఆ కోవకు చెందిన సినిమానే. ఈ కథలో పెద్దగా కొత్తదనం కనిపించకపోవచ్చు. అలాగే సన్నివేశాలు నెమ్మదిగా సాగుతున్న భావన కలగొచ్చు. కానీ పాత్రలతో ఏర్పడే ఎమోషనల్ కనెక్ట్.. సన్నివేశాల్లోని ఆహ్లాదం ప్రేక్షకులను ముందుకు నడిపిస్తుంది. ఏమాత్రం అసభ్యత లేకుండా.. హడావుడి లేకుండా.. సింపుల్ గా సాగిపోయే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కుటుంబ ప్రేక్షకులే కాదు.. యూత్ కూడా కనెక్ట్ అయ్యే అంశాలున్నాయి. అలా మొదలైంది.. కళ్యాణ వైభోగమే లాంటి సినిమాలు చూసిన వాళ్లకు నందని రెడ్డి శైలి ఎలా ఉంటుందో ఒక అంచనాకు ఉంటుంది. 'అన్నీ మంచి శకునములే' కూడా అలాంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనరే. కాకపోతే ఈసారి నందిని నరేషన్ బాగా నెమ్మదించింది. ఎంటర్టైన్మెెంట్ డోస్ కూడా కొంచెం తగ్గింది. ప్రధానంగా ఎమోషన్ల మీద నందిని దృష్టిపెట్టింది. అవి సరిగ్గా పండటం 'అన్నీ మంచి శకునములే'లో మేజర్ హైలైట్.

ఆసుపత్రుల్లో అనుకోకుండా పిల్లలు మారిపోవడం.. దశాబ్దాల నుంచి చూస్తున్న పాయింటే. కొన్నేళ్ల కిందటే 'అల వైకుంఠపురములో'లో ఆ పాయింటునే టచ్ చేశారు. ఈ పాయింట్ పాతదే అయినప్పటికీ ఎవర్ గ్రీన్ అనడంలో సందేహం లేదు. ఇలా జరిగినపుడు చూసేవాళ్లకు గుండె కళుక్కుమంటుంది. ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యాక రెండు కుటుంబాల్లో అసలు నిజం తెలిస్తే కలిగే భావోద్వేగాలతో ఎవ్వరైనా కనెక్ట్ అవుతారు. ఎక్కువగా మెలో డ్రామా లేకుండానే ఈ పాయింట్ మీద ఎమోషన్లను పండించిన విధానం.. పతాక సన్నివేశాలను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమాకు అవే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ లో సైతం డ్రామా తక్కువగా ఉండి.. ప్రాక్టికల్ గా సాగిపోతాయి. పర్టికులర్ గా ఇవి ప్రేమ సన్నివేశాలు అనే ఫీల్ కలిగేలా ఏ సన్నివేశం లేదిందులో. హీరో హీరోయిన్ల మధ్య ఏదో జరిగిపోతున్న ఫీలింగ్ కలిగించకుండా చాలా క్యాజువల్ గా సన్నివేశాలను నడిపించేసింది నందిని. కానీ హీరో ప్రేమ బయటపడి.. హీరోయిన్ కూడా దాన్ని ఫీలవడం మొదలయ్యాక ప్రేక్షకుల్లోనూ ఒక కదలిక వస్తుంది. నందిని పరిణతితో ఆ సన్నివేశాలను డీల్ చేసి మార్కులు కొట్టేసింది.

హీరో హీరోయిన్ల కుటుంబాల మధ్య ఆస్తి గొడవ వ్యవహారమే కొంచెం కంగాళీగా.. అవసరం లేని నస లాగా అనిపిస్తుంది 'అన్నీ మంచి శకునములే'లో. సినిమా అంతటా ఆ గొడవ ప్రస్తావనకు వస్తూనే ఉంటుంది కానీ.. అసలా ఆస్తి గొడవేంటన్నదే సరిగ్గా అర్థం కాదు. కథలో ఏదో బలవంతంగా ఈ ట్రాక్ అతికించిన భావన కలుగుతుంది. ఆరంభంలో హీరో హీరోయిన్ల పుట్టుక.. వారి బాల్యం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలే 20 నిమిషాల పాటు సాగుతాయి. దీన్ని బట్టే నందిని రెడ్డి నెమ్మదిగా ఈ కథను నరేట్ చేయబోతోందని అర్థమైపోతుంది. ఆరంభ సన్నివేశఆలతో కనెక్ట్ అయి.. సినిమా నడత ఎలా ఉంటుందో ఒక అంచనాకు వచ్చి.. అందుకు మానసికంగా సిద్ధమైపోతే 'అన్నీ మంచి శకునములే' ఒక జాలీ రైడ్ లాగే అనిపిస్తుంది. అవసరం లేని కొన్ని సన్నివేశాల్లో.. కొన్ని సీన్లలో సాగతీత ఇబ్బంది పెట్టినా.. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రేక్షకులను ముందుకు నడిపిస్తుంది. ప్రధాన పాత్రలు.. వాటిని ఓన్ చేసుకునేలా సాగిన నటీనటుల పెర్ఫామెన్స్ మనల్ని డ్రైవ్ చేస్తాయి. పాటలు.. నేపథ్య సంగీతం.. ఆహ్లాదకరమైన విజువల్స్ కూడా ఫీల్ ను పెంచుతాయి. ప్రథమార్ధం ఒక మోస్తరుగా అనిపించాక.. ద్వితీయార్ధంలో పెళ్లి చుట్టూ నడిపిన కొన్ని సీన్లు విసిగిస్తాయి. కానీ హీరో ప్రేమ సంగతి బయటికి వచ్చిన దగ్గర్నుంచి ఎమోషన్లు బాాగా పండాయి. పతాక సన్నివేశాల్లోనూ భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. మంచి ఫీల్ తో ప్రేక్షకుడు బయటకి వచ్చేలా సినిమా ముగుస్తుంది. ముందే అన్నట్లు పాత కథ.. స్లో నరేషన్ కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు కానీ.. ఇందులోని ఫీల్ గుడ్ ఫ్యాక్టర్.. ఎమోషన్లు.. ఆ లోపాలను కవర్ చేస్తాయి. క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లను ఇష్టపడేవారికి 'అన్నీ మంచి శకునములే' మంచి ఛాయిసే.


నటీనటులు:

'అన్నీ మంచి శకునములే'కు నటీనటులు.. వారి పెర్ఫామెన్స్ ప్రధాన ఆకర్షణ. మంచి పాత్రలు రాసి.. అందుకు తగ్గ నటీనటులను ఎంచుకున్నారు. సంతోష్ శోభన్ రవ్వంత కూడా అతి లేకుండా చక్కగా తన పాత్రను పండించాడు. అతణ్ని చూడగానే ఒక పాజిటివ్ ఫీల్ కలుగుతుంది. ఎక్కువ ఆలోచించకుండా తోచింది చేసుకుపోయే కుర్రాడి పాత్రకు అతను వంద శాతం న్యాయం చేశాడు. లేదు లేదంటూనే హీరోయిన్ మీద తన ప్రేమను బయటపెట్టే సన్నివేశంలో సంతోష్ ఎంత మంచి నటుడో తెలుస్తుంది. మాళవిక నాయర్ సైతం పరిణతితో తన పాత్రను పండించింది. ప్రథమార్ధంలో ఆమెను చిన్నపిల్లగా చూపించడం కోసం ట్రై చేసిన మేకప్ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది కానీ.. మిగతా సన్నివేశాల్లో ఆమె చూడ్డానికి బాగుంది. తన హావభావాలు ఆకట్టుకుంటాయి. ఆర్య పాత్రకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్. ఈ రోజుల్లో రాజేంద్ర ప్రసాద్ కామెడీ చేస్తే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తోంది కానీ.. ఇందులో చాలా వరకు సీరియస్ గా సాగే పాత్రలో ఆయన ఆకట్టుకున్నాడు. రావు రమేష్ తనదైన శైలిలో నటించాడు. చివరి అరగంటలో ఆయన బాగా హైలైట్ అయ్యాడు. నరేష్ కూడా తన అనుభవాన్ని చూపించాడు. గౌతమి.. వాసుకి.. షావుకారు జానకి.. వీళ్లంతా తక్కువ సన్నివేశాల్లోనే తమదైన ముద్ర వేశారు. వెన్నెల కిషోర్ పరిచయ సన్నివేశాల్లో నవ్వించాడు. కానీ ఆ తర్వాత అతణ్ని పెద్దగా ఉపయోగించుకోలేదు. మిగతా నటీనటులందరూ ఓకే.


సాంకేతిక వర్గం:

కొన్ని రోజుల కిందట 'రామబాణం' సినిమాలో తీవ్రంగా నిరాశపరిచాడు మిక్కీ జే మేయర్. అలాంటి మాస్ మసాలా సినిమాలు తనకు నప్పవని తన మ్యూజిక్ తో చెప్పకనే చెప్పాడతను. ఇప్పుడు 'అన్నీ మంచి శకునములే'లో తన అభిరుచిని చాటాడు. ఇందులో ప్రతి పాటా ఆహ్లాదకరంగా.. చెవులకు ఇంపుగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా మంచి ఫీల్ తో సాగింది. సన్నీ కూరపాటి.. రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. విజువల్స్ ప్లెజెంట్ గా ఉన్నాయి. హిల్ స్టేషన్ నేపథ్యం అయినప్పటికీ.. ఎక్కువగా ఇళ్లలోపలే సన్నివేశాలు సాగిపోయాయి. అయినా ప్రతి విజువల్ బాగుంది. నిర్మాణ విలువల విషయంలో రాజీ పడలేదు. పాత్రలకు అవసరమైన చాలామంది పేరున్న నటీనటులను తీసుకుని.. సినిమాకు అవసరమైన మేర ఖర్చు పెట్టి క్వాలిటీ ఔట్ పుట్ తీసుకొచ్చారు. నందిని రెడ్డి ఎంచుకున్న కథలో ఏమంత కొత్తదనం లేకపోయినా.. ఆమె సన్నివేశాలు తాజాగా అనిపించేలా.. సినిమా అంతటా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండేలా చూసుకుంది. ఆమెకు రచయితలు దావూద్.. లక్ష్మీభూపాల్ బాగానే సహకరించారు. నందిని నరేషన్ మాత్రం గత సినిమాలతో పోలిస్తే బాగా నెమ్మదించింది. సన్నివేశాల్లో సాగతీత కొంచెం తగ్గించి.. అనవసర సన్నివేశాలను ఎడిట్ చేసి ఉంటే.. సినిమా క్రిస్ప్ గా తయారై ప్రేక్షకులకు మరింత మంచి అనుభూతిని ఇచ్చి ఉండేది.

చివరగా: అన్నీ మంచి శకునములే.. నెమ్మదిగా మనసులోకి!

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater