Begin typing your search above and press return to search.

'పెద్దన్న' సాంగ్: బాలు పాడిన చివరి పాట.. తెలుగులో తనయుడి నోట..!

By:  Tupaki Desk   |   30 Oct 2021 9:19 PM IST
పెద్దన్న సాంగ్: బాలు పాడిన చివరి పాట.. తెలుగులో తనయుడి నోట..!
X
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అన్నాత్తే'. సిరుతై శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో ''పెద్దన్న'' అనే పేరుతో రాబోతోంది. దీపావళి సందర్భంగా నవంబర్ 4న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. శనివారం సాయంత్రం 'అన్నయ్య అన్నయ్య' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు.

'అన్నయ్యా అన్నయ్యా అని గుండెలోన పెట్టుకున్న అందరికి థ్యాంక్సు.. అన్నయ్య అన్నయ్య అని ప్రేమ నాకు పంచుతున్న మీకు నేను ఫ్యాన్సు' అంటూ సాగిన ఈ పాట అభిమానులను అలరిస్తోంది. డి.ఇమ్మాన్ ఈ సాంగ్ కు ట్యూన్ కంపోజ్ చేయగా.. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఎస్పీ చరణ్ ఈ గీతాన్ని ఆలపించారు.

తమిళ్ లో ఈ పాటను గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తనదైన శైలిలో ఎనర్జిటిక్ గా ఆలపించారు. ఇది బాలు పాడిన చివరి సాంగ్. 'అన్నాత్తే' కోసం తండ్రి పాడిన ఈ పాటను తెలుగులో తనయుడు పాడడం విశేషం. ఎస్పీబీ ఉంటే తెలుగులోనూ బాలునే పాడేవారని.. ఆయన గాత్రాన్ని మిస్ అవుతున్నామని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

'పెద్దన్న' చిత్రాన్ని కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో ఏషియన్ సినిమాస్ నారాయణదాస్ కె. నారంగ్ మరియు సురేష్ బాబు కలిసి రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - టీజర్ - ట్రైలర్ - 'రా సామీ' సాంగ్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు వచ్చిన 'అన్నయ్య అన్నయ్య' పాట కూడా అలరిస్తోంది.

ఈ చిత్రంలో రజనీకాంత్‌ కు జోడీగా నయనతార నటించగా.. సోదరిగా కీర్తి సురేశ్‌ కనిపించనున్నారు. ఖుష్బూ - మీనా - జగపతి బాబు - ప్రకాశ్‌ రాజ్‌ - సూరి - అభిమన్యు సింగ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. వెట్రి పలనిస్వామి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేశారు. దిలీప్ సుబ్బరాయన్ ఫైట్స్ కంపోజ్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత రజినీ నటిస్తున్న యాక్షన్‌ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ''పెద్దన్న'' ఎలాంటి సక్సెస్ అవుతుందో చూడాలి.