Begin typing your search above and press return to search.

రాజశేఖర్ సినిమాని రజనీతో చేసేస్తున్నారా?

By:  Tupaki Desk   |   17 April 2021 1:30 PM GMT
రాజశేఖర్ సినిమాని రజనీతో చేసేస్తున్నారా?
X
తమిళ స్టార్ డైరక్టర్ శివకు మంచి క్రేజ్ ఉంది. అయితే ఆయన సినిమాల్లో కంటెంట్ మాత్రం ఆల్రెడీ సినిమాల్లో ఉన్నదే అనే కామెంట్ ఉంది. హిట్టైన ఓ పాత కథని తీసుకుని దాన్ని కొద్దిగా అటూ ఇటూ మార్చి స్టైలిష్ మేకింగ్ తో ప్రెజెంట్ చేస్తూంటాడు. అజిత్ వంటి స్టార్స్ తో సినిమాలు వరసగా చేస్తూండటంతో ఓపినింగ్స్ అదిరిపోతాయి. సినిమా ఎలా ఉందని జనాలు ఆలోచించేలోగా నిర్మాతకు లాభాలు వచ్చేస్తూంటాయి. ఇప్పుడు ఆయన రజనీకాంత్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పేరు ‘అన్నాత్తే’. అంటే పెద్దన్నయ్య అని అర్దం.

గతంలో మనకు రాజశేఖర్ తో మా అన్నయ్య అనే సినిమా వచ్చి వెళ్లింది. ఆ సినిమాలో మెయిన్ పాయింట్ ని తీసుకుని రజనీ స్టైల్ కామెడీని కలిపి ఈ కథ వండారని తమిళ సినీ మీడియా టాక్. యాక్షన్ కామెడీగా ఉండే ఈ సినిమా ఫ్యాన్స్‌కి పండగలా ఉంటుందట. రజనీకాంత్‌ యాక్టింగ్‌ స్టైల్‌లో కామెడీని మిక్స్ చేసి అదరకొట్టబోతున్నారట. ఈ మధ్యకాలంలో రజనీ ఆ స్దాయిలో నవ్వించలేదని, సీరియస్ సినిమాలే చేస్తున్నాడని, రెట్రో రజనీని గుర్తు చేస్తాడని అంటున్నారు. రజనీకూడా ఈ కామెడీకే పడిపోయి ఫస్ట్ సిట్టింగ్ లోనే సినిమా ఓకే చేసేసాడట. క్లాస్, మాస్‌ మాత్రమే కాదు.. కామెడీ గా ఫుల్ గా ఉంటుందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

ఇక లాస్ట్ ఇయిర్ డిసెంబరులో రజనీకాంత్‌ అస్వస్థతకు గురవడంతో ఈ సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసారు. అయితే ఇటీవల సినిమా షూటింగ్‌ని తిరిగి హైదరాబాద్‌లో ప్రారంభించారు. రీసెంట్ గా సినిమా షూటింగ్‌ సంబంధించిన వర్కింగ్‌ స్టిల్‌ని నిర్మాణ సంస్థ తన ట్వీటర్‌లో పోస్ట్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చి వైరలైంది. హైదరాబాద్‌, చెన్నైలలో షూటింగ్‌ జరుపుకున్న తర్వాత కొన్ని సీన్స్ ను కోల్‌కత్తాలోనూ షూట్ చేయనున్నారని సమాచారం.

చిత్ర హీరోయిన్ నయనతార ప్రస్తుతం కొచ్చిలో ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది. కళానిధి సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్, రోబో శంకర్‌ తదితరులు నటిస్తున్నారు. సంగీత దర్శకుడు డి.ఇమ్మాన్‌ రజనీకాంత్‌తో కలిసి చేస్తున్న మొదటి సినిమా ఇదే. నవంబర్‌ 4, 2021న సినిమాని దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.