Begin typing your search above and press return to search.

పవన్ హ్యాండిచ్చిన హీరోయిన్‌ కు ఇంకో ఛాన్స్

By:  Tupaki Desk   |   10 May 2016 9:30 AM GMT
పవన్ హ్యాండిచ్చిన హీరోయిన్‌ కు ఇంకో ఛాన్స్
X
అనీషా ఆంబ్రోస్.. తెలుగులో చేసింది రెండే సినిమాలు. అవి రెండూ లో బడ్జెట్ మూవీసే. రెండూ కూడా ఫ్లాపే అయ్యాయి. అయినప్పటికీ ఓ ఆర్నెల్ల పాటు ఈమె పేరు మార్మోగిపోయింది. అందుకు కారణం.. ఆమెను పవన్ కళ్యాణ్ తన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో హీరోయిన్‌ గా ఎంచుకోవడమే. ‘అలియాస్ జానకి’ లాంటి చిన్న సినిమాతో హీరోయిన్‌ గా పరిచయమైన అనీషాను పవన్ తన పక్కన జోడీగా ఎంచుకోవడమేంటో జనాలకు అంతుబట్టలేదు. పవన్ అభిమానులైతే ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఐతే అభిమానుల ఒత్తిడికి తలొగ్గాడో.. లేక తనే పునరాలోచించుకున్నాడో కానీ.. ఉన్నట్లుండి అనీషాకు టాటా చెప్పేశాడు పవన్. దీంతో సంపత్ నంది లాగే అనీషా కూడా తీవ్ర నిరాశకు గురైంది.

పవన్ హ్యాండిచ్చాక సందీప్ కిషన్ సరసన ‘రన్’లో నటించే అవకాశం అందుకున్న అనీషాకు ఆ సినిమా కూడా చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ దెబ్బతో ఆమె టాలీవుడ్ నుంచి దుకాణం కట్టేయడం ఖాయం అనుకున్నారంతా. కానీ అనీషా మరో ఛాన్స్ పట్టేసింది. చంద్రశేఖర్ ఏలేటి లాంటి టాలెంటెడ్ దర్శకుడు ఆమెకు అవకాశమిచ్చాడు. ‘సాహసం’ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న ఏలేటి.. ప్రస్తుతం సాయి కొర్రపాటి నిర్మాణంలో ‘మనమంతా’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో అనీషాకు కూడా ఓ రోల్ దొరికింది. ‘కేరింత’ ఫేమ్ విశ్వాంత్‌ కు జోడీగా ఆమె నటిస్తోంది. ఏలేటి గత సినిమాల్లాగే ఇది కూడా ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోందట. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉంది.