Begin typing your search above and press return to search.

మా సినిమాకు పేరు పెట్టండి ప్లీజ్

By:  Tupaki Desk   |   24 Jan 2016 10:30 PM GMT
మా సినిమాకు పేరు పెట్టండి ప్లీజ్
X
దశాబ్దంన్నర కిందట జేడీ చక్రవర్తి, మీనా జంటగా ఒక పేరు లేని సినిమా వచ్చింది గుర్తుందా? పేరు లేకుండానే సినిమా రిలీజ్ చేసి.. ప్రేక్షకుల్నే పేరు పెట్టమన్నారు ఆ దర్శక నిర్మాతలు. ప్రేక్షకులు సూచించిన పేర్లలోంచి చివరికి ‘పాపే నా ప్రాణం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత మంచు మనోజ్ సినిమా ‘బిందాస్’కు కూడా ఇలాగే ప్రేక్షకుల సూచన మేరకు టైటిల్ పెట్టారు. ఐతే దానికి టైటిల్ ఆఫ్షన్స్ వాళ్లే ఇచ్చారు. ‘అజయ్ గాడి వీర గాథ’ అని ఇంకో టైటిల్ కాదని.. ‘బిందాస్’కే ఓటేశారు జనాలు. ఇప్పుడు సందీప్ కిషన్ అండ్ కో అలాంటి ఆప్షన్లేమీ ఇవ్వకుండా సినిమా కాన్సెప్ట్ మాత్రం చెప్పి టైటిల్ ఫిక్స్ చేయండి అని ప్రేక్షకుల్ని అడుగుతోంది.

సందీప్ కిషన్ - అనీషా ఆంబ్రోస్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు అసాధ్యుడు - మిస్టర్ నూకయ్య ఫేమ్ అని కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళం, మలయాళ భాషల్లో పెద్ద హిట్టయిన ‘నేరం’కు ఇది రీమేక్. ముందు ‘123’ అనే టైటిల్ అనుకున్నారు కానీ.. తర్వాత అది వద్దని ఫిక్సయ్యారు. ఇప్పుడు ప్రేక్షకుల సూచనతోనే టైటిల్ ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. బ్యాడ్ టైం వెనకే గుడ్ టైం కూడా ఉంటుంది అనేది ఈ సినిమా కాన్సెప్ట్. సందీప్, అనీషా కలిసి ఓ వీడియో రూపొందించి దాని ద్వారా జనాలకు అప్పీల్ ఇచ్చారు. ఆ వీడియో సరదాగా బాగానే ఉంది. ‘గబ్బర్ సింగ్-2’లో ఛాన్స్ అందుకున్నట్లే అందుకుని కోల్పోయిన అనీషా తన కొత్త సినిమాకు ‘గబ్బర్ సింగ్-3’ అనే టైటిల్ పెడదామని ఈ వీడియోలో అనడం విశేషం. దానికి సందీప్.. ‘ఆశ పడటంలో తప్పులేదు. ఫ్యూచర్ కి ఆల్ ద బెస్ట్’ అంటాడు. తమ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసిన వారికి సినిమా ప్రమోషనల్ పార్టీలో భాగం కల్పిస్తామని అంటోంది యూనిట్. మరెందుకు ఆలస్యం ఆ టైటిలేదో సజెస్ట్ చేసి పార్టీలో జాయినైపోండి మరి.