Begin typing your search above and press return to search.

అజ్ఞాతవాసిలో అన్నీ తనే పాడేశాడే

By:  Tupaki Desk   |   19 Dec 2017 11:58 AM IST
అజ్ఞాతవాసిలో అన్నీ తనే పాడేశాడే
X
అప్పుడెప్పుడో రాజ్-కోటి వంటి కంపోజర్లు తెలుగు సినిమాలకు భారీ హిట్ ఆల్బమ్స్ అందిస్తున్న వేళ.. మీరు మెగాస్టార్ సినిమా తీసుకున్నా బాలయ్య సినిమా తీసుకున్నా.. దాదాపు 'గానం' అనే కాలమ్న్ లో ఎస్.పి.బాలసుబ్రమణ్యం అనే పేరే కనిపించేది. ఆయన పేరు పక్కనే సుశీల.. శైలజ అంటూ మరో రెండు పేర్లు మాత్రమే కనిపించేవి. కాని.. ఏఆర్ రెహ్మాన్ వచ్చాక.. అసలు ఒక్కోపాటను ఒక్కో సింగర్ తో పాడించడం మొదలెట్టాడు. చివరకు ఆల్బమ్స్ లో బాలు ఒక్క పాటకే పరిమితం అయిపోయారు. ఇప్పుడు ఆ సింగిల్ సాంగు కూడా లేదనుకోండి.

అసలు ఈ కథంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. తెలుగులోకి కొత్తగా వస్తున్న టాలెంటెడ్ కంపోజర్ అనిరుధ్.. ఇప్పుడు మరో ప్రయోగం చేస్తున్నాడు. అసలు తనకు తెలుగు బాష తెలియకపోయినప్పటికీ.. మనోడు పవన్ కళ్యాణ్‌ 25వ సినిమా కోసం కంపోజ్ చేసిన పాటలన్నీ దాదాపు తానే పాడేశాడు. ఏదో త్రివిక్రమ్ కోరిక మీద ఓ రెండు పాటలను మాత్రం వదిలేశాడు. మొత్తాంగా అజ్ఞాతవాసి సినిమాలో ఐదు పాటలున్నాయి. అందులో ధగధగమంటే.. బైటికొచ్చిచూస్తే.. గాలి వాలుగా.. పాటలను అనిరుధ్‌ ఆలపించాడు. ట్రైలర్లో మనకు వినిపించిన స్వగతం కృష్ణా అంటూ సాగే క్లాసికల్ ను మాత్రం వేరే సింగర్ కు ఇచ్చి.. ఇక 'ఏబి ఎవరో నీ బేబీ' అంటూ సాగే మరో పాటను నకాష్‌ అజీజ్ తో పాడించాడు. ఆ విధంగా చూస్తే ఆల్బమ్ అంతటా అనిరుధ్‌ వాయిస్ మాత్రమే కనిపిస్తోంది.

సాధారణంగా చాలామంది కంపోజర్లు ఇలా తాము కంపోజ్ చేసిన సినిమా కోసం ఒక్క పాటను పాడతారు. మన దేవిశ్రీప్రసాద్.. తమన్.. చివరకు రెహ్మాన్ కూడా అదే ఫాలో అవుతున్నారు. కాని అనిరుధ్‌ మాత్రం.. వెరైటీగా అల్బమ్ అంతా తన గొంతుతోనే నింపేస్తున్నాడు. కాకపోతే ఆ పాటలు కూడా హిట్టవుతున్నాయి కాబట్టి.. అందరూ హ్యాపీసేలే!!