Begin typing your search above and press return to search.

వద్దు వద్దని అతడినే పెట్టుకున్నారు

By:  Tupaki Desk   |   9 Jan 2018 5:04 AM GMT
వద్దు వద్దని అతడినే పెట్టుకున్నారు
X
తెలుగుతో పోలిస్తే తమిళంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎక్కువే. ఇళయరాజా.. ఎ.ఆర్.రెహమాన్ లాంటి దిగ్గజాలు ఇంకా యాక్టివ్‌ గా, తీరిక లేకుండా సినిమాలు చేస్తుండగా.. ఈ తరంలో హారిస్ జైరాజ్.. యువన్ శంకర్ రాజా.. డి.ఇమాన్.. జిబ్రాన్.. విజయ్ ఆంటోనీ.. జి.వి.ప్రకాష్ కుమార్.. అనిరుధ్ రవిచందర్ లాంటి చాలామంది యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నారు. ఐతే ఇప్పుడు ఇంతమంది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లున్నా.. ఇంత పోటీ ఉన్నా.. అనిరుధ్ రవిచందర్ ఉన్నంత ఫాంలో ఇంకెవరూ లేరు. కొన్నేళ్లుగా కోలీవుడ్ లో అతను మెగా మెగా సినిమాలు చేశాడు. చాలామంది స్టార్లతో పని చేశాడు.

అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో వచ్చిన చివరి రెండు సినిమాలు ‘వేదాలం’.. ‘వివేగం’లకు అనిరుధే మ్యూజిక్ ఇచ్చాడు. ఈ రెండు ఆడియోలకూ మంచి రెస్పాన్స్ వచ్చింది. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనూ అప్లాజ్ వచ్చింది. ఐతే శివ-అజిత్ కాంబోలో రాబోతున్న తర్వాతి సినిమా ‘విశ్వాసం’కు మాత్రం ముందు అనిరుధ్ ను వద్దనుకున్నారు. తమ కాంబినేషన్లో అనిరుధ్ మ్యూజిక్ అంటే మొనాటనీ వచ్చేస్తుందనో.. లేక అనిరుధ్ ఖాళీ లేకనో.. కారణమేంటో కానీ.. ముందు అతడు వద్దనుకుని యువన్ శంకర్ రాజాను సంగీత దర్శకుడిగా ప్రకటించారు. కానీ ఇప్పుడేమైందో ఏమో.. యువన్ కాదని మళ్లీ అనిరుధ్ నే ఎంచుకున్నారు. ‘విశ్వాసం’ ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ అని సమాచారం. ‘వివేగం’ ఫ్లాప్ అయినా సరే.. శివతో నాలుగోసారి జత కట్టడానికి అజిత్ రెడీ అవుతుండటం విశేషం.