Begin typing your search above and press return to search.

‘ఆగడు’ పెద్ద తప్పని ఒప్పుకున్నాడు

By:  Tupaki Desk   |   21 Jan 2016 7:30 AM GMT
‘ఆగడు’ పెద్ద తప్పని ఒప్పుకున్నాడు
X
ఒక పెద్ద డిజాస్టర్ వస్తేనే నిర్మాత కోలుకోవడం కష్టం. అలాంటిది వరుసగా రెండు భారీ డిజాస్టర్లు. ఒక్కోదానికి పాతిక కోట్ల దాకా నష్టం మిగిలిస్తే.. ఎంతటి బడా నిర్మాణ సంస్థకైనా కష్టమే. ‘14 రీల్స్’ అలాంటి పరిస్థితే ఎదుర్కొంది. 1 నేనొక్కడినే - ఆగడు సినిమాలు ఆ సంస్థను దారుణంగా దెబ్బ తీశాయి. దాదాపు ఏడాది పాటు మళ్లీ సినిమా మొదలుపెట్టలేని పరిస్థితి తెచ్చిపెట్టాయి. మళ్లీ సినిమా ఆరంభించినా.. నాని హీరోగా లో బడ్జెట్ లో తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఐతేనేం ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’కు కావాల్సినంత క్రేజ్ అయితే వచ్చింది. చిన్న సినిమాతోనే ‘14 రీల్స్’ పేరు మళ్లీ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. నిన్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను మహేష్ ముఖ్య అతిథిగా చాలా బాగా చేసింది 14 రీల్స్ సంస్థ.

ఈ సందర్భంగా ముగ్గురు నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర తమ సంస్థ పడ్డ ఇబ్బందుల గురించి మొహమాటం లేకుండా ప్రస్తావించాడు. ‘‘ఏడాదిన్నర కిందట తెలిసో తెలియకో మేం తప్పులు చేశాం. దాని వల్ల 14 రీల్స్ చాలా ఇబ్బందుల్లో పడింది. ఐతే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ మా సంస్థ మళ్లీ కోలుకోవాలని.. మేం మళ్లీ సినిమాలు చేయాలని కోరుకున్నారు. అందరి సపోర్ట్ తో మళ్లీ మేం నిలబడ్డాం. నాని ఎంతో అండగా నిలిచాడు. కష్టకాలంలో సపోర్ట్ ఇచ్చిన వాళ్లను మరిచిపోకూడదు. మేం ముగ్గురు నిర్మాతలం కలిసి విని ఒకేసారి ఓకే చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ విషయంలో అదే జరిగింది. ఈ సినిమా కూడా అలాగే హిట్టవుతుందని ఆశిస్తున్నాం’’ అని అనిల్ చెప్పాడు. ఇంతకుముందు మహేష్ ‘ఆగడు’ పెద్ద మిస్టేక్ అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు అనిల్ కూడా ‘ఆగడు’ పేరెత్తకుండా తాము పెద్ద తప్పు చేశామని చెప్పడం విశేషం.