Begin typing your search above and press return to search.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బ్రాండ్ వాల్యూ వర్కౌట్ అవుతుందా..?

By:  Tupaki Desk   |   10 March 2021 9:30 AM GMT
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బ్రాండ్ వాల్యూ వర్కౌట్ అవుతుందా..?
X
టాలీవుడ్ లో అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్న అనిల్ రావిపూడి.. ఇప్పుడు నిర్మాతగా మారి చిన్న సినిమాకి సపోర్ట్ గా నిలిచాడు. రాజేంద్రప్రసాద్ - శ్రీవిష్ణు ప్రధాన పాత్రలతో రూపొందుతున్న ''గాలి సంపత్'' సినిమాకి అనిల్ సమర్పకుడిగా ఉన్నారు. అంతేకాదు దీనికి అనిల్ దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించాడు. అనీష్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ మరియు ఇమేజ్‌ స్పార్ట్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలసి నిర్మిస్తున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా రేపు మార్చి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అన్నీ తానై ప్రమోషనల్ కార్యక్రమాలు చూసుకుంటున్నాడు. తన బ్రాండ్ వాల్యూ మీద వస్తున్న 'గాలి సంపత్' రిజల్ట్ అనిల్ కి ఒక పరీక్ష లాంటిదనే చెప్పాలి.

రేపు 'గాలి సంపత్' తో పాటుగా శర్వానంద్ 'శ్రీకారం' - నాగ్ అశ్విన్ నిర్మించిన 'జాతిరత్నాలు' సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ సినిమాలకు పోటీనిచ్చేది సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి బ్రాండ్ వాల్యూ అని చెప్పవచ్చు. అందుకే ఈ చిత్రాన్ని భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో ఆడియన్స్ దృష్టిని 'గాలి సంపత్' ఆకర్షించాడు. తండ్రీకొడుకుల మధ్య నడిచే ఈ ఎమోషనల్ ఎంటర్టైనర్ లో రాజేంద్రప్రసాద్ - శ్రీవిష్ణు నటన హైలైట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే 'గాలి సంపత్' కి ఫెస్టివల్ వీకెండ్ లో మంచి వసూళ్ళు వచ్చే అవకాశం ఉంది. శివరాత్రి పోరులో మిగతా సినిమాలను తట్టుకుని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బ్రాండ్ వాల్యూ ఎలా వర్కవుట్ అవుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.