Begin typing your search above and press return to search.

రవితేజ గుడ్డిగా నమ్మేశాడట

By:  Tupaki Desk   |   7 Oct 2017 12:50 PM IST
రవితేజ గుడ్డిగా నమ్మేశాడట
X
‘రాజా ది గ్రేట్’ సినిమాలో గుడ్డివాడిగా నటించిన హీరో రవితేజ తనను గుడ్డిగా నమ్మాడని అంటున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో రాధిక హీరో తల్లిగా నటించిందని.. ఆమెకు తన కొడుకుపై గుడ్డి నమ్మకం ఉంటుందని.. తను ఏమైనా చేయగలడని అనుకుంటుందని.. కొడుకు అంధుడైనప్పటికీ చిన్నప్పటి నుంచి అతణ్ని చాలా ఆత్మవిశ్వాసంతో పెంచుతుందని.. ట్రైన్ చేస్తుందని.. ఆమె తన కొడుకును ఎలా గుడ్డిగా నమ్ముతుందో రవితేజ కూడా తనను అంతే నమ్మాడని అనిల్ తెలిపాడు.

తాను తొలిసారి రవితేజకు ‘రాజా ది గ్రేట్’ కథ గురించి కేవలం 20 నిమిషాలు మాత్రమే నరేషన్ ఇచ్చానని.. అప్పుడే సినిమా చేస్తున్నట్లు చెప్పేశాడని.. ఆ తర్వాత అప్పుడప్పుడూ ఒక్కో ఎపిసోడ్ చెబుతూ చివరికి చాన్నాళ్ల తర్వాత ఫుల్ నరేషన్ ఇచ్చానని అనిల్ తెలిపాడు. హీరోగా అంధుడిగా పెట్టి ఒక సినిమా చేయాలంటే గట్స్ ఉన్న హీరో.. నిర్మాత కావాలని.. వాళ్లు మనల్ని నమ్మాలని.. రవితేజ-దిల్ రాజు ఇద్దరూ అలా తనను నమ్మబట్టే ఒక కొత్త తరహా సినిమా చేయగలిగానని అతనన్నాడు.

దిల్ రాజు తన లాంటి దర్శకులందరికీ హెడ్ మాస్టర్ లాంటి వాడని.. తాను కొంచెం డల్ స్టూడెంట్ అని అనిల్ చమత్కరించాడు. ‘రాజా ది గ్రేట్’ ట్రైలర్ చివర్లో ‘‘ప్రేక్షకుల ముఖచిత్రాలేంటి’’ అని రవితేజ అడుగుతాడని.. సినిమా అంతటా ఒక హుక్ లైన్ లాగా ఇది వస్తూనే ఉంటుందని.. భలేగా ఎంటర్టైన్ చేస్తుందని అనిల్ తెలిపాడు. రవితేజ నిజంగా ఓ అంధుడిలాగే ఈ సినిమాలో నటించాడని అతనన్నాడు. ఒక కొత్త ప్రయత్నం చేశామని.. ప్రేక్షకులు ఆదరించాలని అనిల్ కోరాడు.