Begin typing your search above and press return to search.

విరుష్క రిసెప్షన్లో అతనే హైలైట్

By:  Tupaki Desk   |   27 Dec 2017 10:57 AM GMT
విరుష్క రిసెప్షన్లో అతనే హైలైట్
X
ఇటలీలో పెళ్లి చేసుకుని స్వదేశానికి వచ్చిన విరాట్ కోహ్లి-అనుష్క శర్మ జంట పోయిన వారం ఢిల్లీలో రిసెప్షన్ పెడితే.. అందులో ఆశించిన స్థాయిలో హంగామా కనిపించలేదు. ఇటు కోహ్లి, అటు అనుష్క మరీ సంప్రాదాయ బద్ధంగా తయారై రావడం.. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ మినహాయిస్తే ప్రముఖులు పెద్దగా రాకపోవడం.. ఇందులో గానా బజానా కూడా పెద్దగా లేకపోవడంతో మీడియాలో కూడా దీని గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ మంగళవారం నాడు ముంబయిలో జరిగిన రెండో రిసెప్షన్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా జరిగింది.

ఈ వేడుక చాలా సందడిగా సాగింది. ఇటు అనుష్క తరఫున బాలీవుడ్ సెలబ్రెటీలు.. అటు కోహ్లి తరఫున క్రికెటర్లు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఈ వేడుక కళే వేరుగా కనిపించింది. మొన్ననే శ్రీలంకతో టీ20 సిరీస్ ముగించుకున్న భారత క్రికెటర్లతో పాటు సచిన్ టెండూల్కర్ సహా ఎందరో మాజీ క్రికెటర్లు ఈ వేడుకలో తళుక్కుమన్నారు. ఇక బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్.. షారుఖ్ ఖాన్.. రణబీర్ కపూర్.. కంగనా రనౌత్.. ఇలా పెద్ద ఎత్తునే తారాగణం ఈ వేడుకకు హాజరైంది. ఇంతమంది బాలీవుడ్, క్రికెట్ సెలబ్రెటీలు ఒకేచోట ఉంటే సందడి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? దీంతో ఈ వేడుక హోరెత్తిపోయింది. ఐతే ఈ వేడుకకు ఎంతమంది సెలబ్రెటీలు వచ్చినా.. అందర్లోకి ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షించింది మాత్రం అనిల్ కుంబ్లేనే. అతను కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యాడు. కోహ్లితో విభేదాల నేపథ్యంలోనే ఏడాది తిరక్కుండానే కుంబ్లే భారత జట్టు కోచ్ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విభేదాలన్నీ పక్కన పెట్టి కుంబ్లే ఈ వేడుకకు రావడం ఆసక్తి రేకెత్తించింది.