Begin typing your search above and press return to search.

రద్దు ‘క్యూ’పై మురిసిపోయిన హీరో

By:  Tupaki Desk   |   1 Dec 2016 4:02 PM GMT
రద్దు ‘క్యూ’పై మురిసిపోయిన హీరో
X
పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై దేశ ప్రజలు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నా.. నగదు విత్ డ్రా చేసుకునేందుకు.. ఏటీఎంలలో డబ్బు డ్రా చేసుకునేందుకు క్యూలో నిలుచుంటున్న వారు మాత్రం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బులు బ్యాంకుల్లో ఉంచుకొని తమకీ ఖర్మ ఏమిటంటూ మొత్తుకుంటున్నారు.

సహనానికి పరీక్షగా మారాయని క్యూ లైన్లపై సగటుజీవి చిరాకు పడిపోతుంటే.. మరోవైపు కొందరు సెలబ్రిటీలు మాత్రం తమకీ అవకాశం కల్పించిన ప్రధాని మోడీకి అభినందనలు చెప్పుకుంటున్నారు. సగటు జీవికి కష్టంగా ఉన్న ఈ వ్యవహారం.. సెలబ్రిటీలకు మాత్రం సరదాగా ఉండటం కాసింత ఆశ్చర్యంగా చెప్పాలి. తాజాగా అలా మురిసిపోయారు బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్.

ముంబయిలోని ఒక ఏటీఎం కేంద్రానికి డబ్బులు విత్ డ్రా చేసుకోవటానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా క్యూలో నిలుచున్నారు. తమతో క్యూలో నిలుచున్న అనిల్ కపూర్ ను చూసిన ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతలో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి కావటమే కాదు.. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. క్యూలైన్ వదిలేసి.. ఆయనతో సెల్ఫీలు దిగిన వారు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

వీరి ఆనందం ఇలా ఉంటే.. తన అభిమానుల్ని కలిసే అవకాశం నోట్ల రద్దు నిర్ణయం కారణంగా వచ్చిందని చెబుతూ.. తాను క్యూలైన్లో నిలుచునే అవకాశం ఇచ్చిన మోడీకి థ్యాంక్స్ చెబుతూ అనిల్ కపూర్ అభిమానుల ట్వీట్స్ కు రీట్వీట్ చేశారు. సరదాగా క్యూలో నిలుచోవటం వేరు.. డబ్బులు అవసరమై.. క్యూలో గంటల తరబడి నిలుచోవటం వేరు. సెలబ్రిటీలకు అలాంటి అనుభవం ఎదరయ్యే ఛాన్స్ లేదని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/