Begin typing your search above and press return to search.

థియేటర్లకు మోడీ వరమిచ్చినా జగన్ కరునించక పోవచ్చు

By:  Tupaki Desk   |   5 Oct 2020 12:40 PM IST
థియేటర్లకు మోడీ వరమిచ్చినా జగన్ కరునించక పోవచ్చు
X
ఆరేడు నెలల నిరీక్షణకు తెరదించుతూ ఎట్టకేలకు దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వం. కరోనా నిబంధనలు పాటిస్తూ, 50 శాతం కెపాసిటీతో ఈ నెల 15 నుంచి థియేటర్లు నడుపుకోవచ్చని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఐతే కేంద్రం అనుమతి ఇచ్చింది కానీ.. తుది నిర్ణయం మాత్రం రాష్ట్రాలదే. ఎందుకంటే కరోనా ప్రభావం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది కాబట్టి తీవ్రతను బట్టి రాష్ట్రాల ప్రభుత్వాలే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే థియేటర్లు తెరిచేలాగే కనిపిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అందుకు అవకాశం లేనట్లే అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఇప్పటికీ రోజువారీ కేసులు 7-8 వేల మధ్య ఉంటున్నాయి. మరణాలు కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలోనే పాఠశాలలు తెరవాలన్న నిర్ణయాన్ని మరోసారి వాయిదా వేశారు.

కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు కనిపించని ఈ సమయంలో థియేటర్లు ఓపెన్ చేసి జనాల్ని సినిమాలు చూడమని చెప్పలేమన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంకొన్ని రోజులు ఆగాలని థియేటర్ల యాజమాన్యాలకు చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. నవంబరులో పరిస్థితిని బట్టి థియేటర్లను అనుమతించాలని అనుకుంటున్నారు. ఏపీలో థియేటర్లు తెరుచుకోనపుడు తెలంగాణలో థియేటర్లు తెరవడం వల్ల కూడా పెద్ద ఉపయోగం ఉండదు. మామూలుగానే 50 శాతం కెపాసిటీతో థియేటర్లు నడుస్తాయంటే కొత్త సినిమాలు రిలీజ్ చేయరు.

అలాంటిది ఒక తెలుగు రాష్ట్రంలో థియేటర్లు మూత పడి ఉండగా.. ఇంకో చోట రిలీజ్ చేస్తే వచ్చే ఆదాయం ఏముంటుంది? కాబట్టి థియేటర్లు తెరుచుకున్నా సరే.. ఒక నెల రోజుల పాటు కొత్త చిత్రాల విడుదల కష్టమే. బహుశా నవంబరు మధ్యలో దీపావళి సమయానికి ఏపీలో థియేటర్లకు అనుమతి ఇవ్వొచ్చని, అప్పటికి పూర్తి కెపాసిటీతో థియేటర్లు నడుపుకునేలా కూడా అనుమతులు లభిస్తే కొత్త సినిమాల విడుదలకు ఆస్కారముందని అంటున్నారు.