Begin typing your search above and press return to search.

ఏపీలో టిక్కెట్టుపై షాకిచ్చిన జ‌గ‌న్ స‌ర్కార్?

By:  Tupaki Desk   |   7 July 2021 6:00 PM IST
ఏపీలో టిక్కెట్టుపై షాకిచ్చిన జ‌గ‌న్ స‌ర్కార్?
X
తెలుగు సినీప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌తో ఏపీ స‌ర్కార్ రిలేష‌న్ షిప్ నీటి బుడ‌గ చందంగా మారిందా? అగ్ర నిర్మాత‌లు సినీపెద్ద‌లు వెళ్లి క‌లిసినా టిక్కెట్టు ధ‌ర‌ల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ దిగి రాలేదా? అంటే అవున‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌ డిమాండ్లను పక్కన పెడుతూ జగన్ సర్కార్ టిక్కెట్ ధ‌ర త‌గ్గింపు పై కీలక నిర్ణయం తీసుకుందని ప్ర‌చార‌మ‌వుతోంది.

సినిమా టిక్కెట్టు ధ‌ర‌లు పెంచాలంటే ముందుగా ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించాల్సిందే. ఇష్టానుసారం పెంచుకునేందుకు వెసులుబాటు లేనే లేద‌ని ఖ‌రా కండిగా తెగేసి చెబుతున్నార‌ట‌. ఇంత‌కుముందే వివిధ కేట‌గిరీల టికెట్ ధ‌ర‌ల‌పైనా ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. ప్ర‌భుత్వ ఆదేశాలు లేనిదే టిక్కెట్టు రేటుపై ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నార‌ని తెలిసింది.

నిజానికి టిక్కెట్టు పెంపు కుద‌ర‌దంటూ ఏపీ స‌ర్కార్ ఇటీవ‌ల జీవోను స‌వ‌రించింది. సినిమా నియంత్రం చట్టం 1955 ప్రకారం జారీ చేసిన 1273 జీవోను సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై గతంలో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. అప్ప‌ట్లో తిరుప‌తి ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప‌వ‌న్ పై క‌క్ష తీర్చుకునేందుకు వ‌కీల్ సాబ్ కి చిక్కులు తెచ్చేందుకు ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని భావించారు. కానీ టిక్కెట్టు ధ‌ర‌ల వ్య‌వ‌హారంలో ఏపీ స‌ర్కార్ దిగి వ‌చ్చే మార్గం క‌నిపించ‌డం లేద‌ని తాజాగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. టిక్కెట్టు విష‌యంలో సినీపెద్ద‌ల విన్న‌పాన్ని జ‌గ‌న్ పూర్తిగా పెడ చెవిన పెడుతున్నార‌ని కూడా తెలుస్తోంది.

అయితే రేప‌టి నుంచి 50శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు తెరుచుకునేందుకు ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ అనుమ‌తులు మంజూరు చేసినా టిక్కెట్టు ధ‌ర‌లపై జీవోని మార్చ‌క‌పోతే ఆ మేర‌కు ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ స్వ‌యంగా టిక్కెట్టు రేట్ల విష‌య‌మై ఏపీ ప్ర‌భుత్వానికి లేఖ‌ను రాసిన సంగ‌తి తెలిసిందే. అలాగే సినీపెద్ద‌లు కూడా జ‌గ‌న్ స‌ర్కార్ ను టిక్కెట్టు ధ‌ర‌ల విష‌య‌మై సంప్ర‌దించినా అట్నుంచి రెస్పాన్స్ లేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

తెలంగాణ‌లో వంద‌శాతం ఆక్యుపెన్సీతో థియ‌ట‌ర్ల‌ను ర‌న్ చేసుకోవ‌చ్చు. ఏపీలో 50శాతం తో ర‌న్ అవ్వాలి. అదే స‌మ‌యంలో త‌క్కువ ధ‌ర‌లే అమ‌ల్లో ఉంటాయ‌ని తెలుస్తోంది. అయితే ఇవే రేట్ల‌తో థియేట‌ర్ల మెయింటెనెన్స్ కూడా క‌ష్ట‌మ‌వుతుంద‌ని ప్ర‌స్తుత క్రైసిస్ లో జ‌నం థియేట‌ర్ల‌కు వచ్చే ప‌రిస్థితి కూడా లేద‌ని నిర్మాత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. మునుముందు ప‌లు భారీ చిత్రాల్ని రిలీజ్ చేయాల్సి ఉండ‌గా జ‌గ‌న్ స‌ర్కార్ దెబ్బ‌కు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సినిమాల రిలీజ్ ల‌పై డైల‌మా నెల‌కొంది. ఏపీలో ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే సినిమాల‌కు తీవ్ర న‌ష్టాలు త‌ప్ప‌వ‌ని ప‌రిశ్ర‌మ ఆందోళ‌న చెందుతోంది. మునుముందు ఆచార్య‌- పుష్ప‌- కేజీఎఫ్ 2- ఆర్.ఆర్.ఆర్ స‌హా ప‌లు క్రేజీ చిత్రాలు రిలీజ్ కి రావాల్సి ఉండ‌గా.. ఏపీలో టిక్కెట్టు ధ‌రల పెంపుద‌ల‌పై చిక్కులు రావ‌డం ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. టిక్కెట్టు ధ‌ర‌ల‌పై ప్రభుత్వ నిర్ణ‌య‌మే ఫైన‌ల్... అని తేల్చి చెప్ప‌డంతో చేసేదేమీ లేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇంత‌కీ రేప‌టి నుంచి థియేట‌ర్ల‌ను తెరుస్తారా లేదా? అస‌లు సినిమాలు రిలీజ‌వుతాయా లేదా? అన్న‌ది కూడా వేచి చూడాల్సి ఉంది. దీనిపై సినీపెద్ద‌లు నేరుగా వెళ్లి సీఎం జ‌గ‌న్ తో మ‌రోమారు మంత‌నాలు సాగిస్తారా? అన్న‌ది వేచి చూడాలి.

ఇక త‌గ్గించిన ధ‌ర‌లతో కొంత‌వ‌ర‌కూ మ‌ల్టీప్లెక్సులు స‌ర్వైవ్ కాగ‌లిగినా కానీ సింగిల్ థియేట‌ర్ల‌కు అస్స‌లు కిట్టుబాటు కాద‌న్న విశ్లేషణ ఇంత‌కుముందు సాగింది. స‌ర్కార్ ఇలా మొండి ప‌ట్టు ప‌డితే మునుముందు థియేట‌ర్లు క‌ళ్యాణ మంట‌పాలు గా మారినా ఆశ్చ‌ర్యం లేద‌న్న ఆందోళ‌న నెల‌కొంది. ఇక వెయిటింగ్ లో ఉన్న సినిమాల రిలీజ్ ల‌పై మ‌రోమారు సందిగ్ధ‌త‌లు నెల‌కొన్న‌ట్టే.