Begin typing your search above and press return to search.

మహేష్ 99 మంది పిల్లలకు జీవితాన్నిచ్చాడు

By:  Tupaki Desk   |   5 Nov 2017 3:42 PM IST
మహేష్ 99 మంది పిల్లలకు జీవితాన్నిచ్చాడు
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు పల్లెటూళ్లను దత్తత తీసుకుని సొంత ఖర్చుతో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ బాబు సహకారంతో 99 మంది చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయించిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణ సొంత ఊరు అయిన ఈ బుర్రిపాలెంలో తన బావ.. ఎంపీ గల్లా జయదేవ్ సహకారంతో మహేష్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాడు.

బుర్రిపాలెంలో ప్రతి నెలా ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో వైద్య శిబిరం నిర్వహిస్తుంది మహేష్ బాబు టీం. ఇందులో భాగంగా బుర్రిపాలెంతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన పిల్లల్లోంచి గుండె జబ్బులతో బాధపడుతున్న 99 మందిని గుర్తించారట. వీళ్లందరికీ సర్జరీలు చేయించి వారికి ప్రాణదానం చేశారట వైద్యులు. ఏకంగా 99 మందికి సర్జరీలు చేయించడమంటే చిన్న విషయం కాదు. చాలా పెద్ద మొత్తంలోనే ఖర్చవుతుంది. ఈ ఖర్చంతా మహేష్ బాబే పెట్టుకున్నాడట. సర్జరీలు అయిన చిన్నారులు.. వారి కుటుంబ సభ్యుల ఫొటోలను మహేష్ బాబు ట్విట్టర్లో షేర్ చేస్తూ.. శస్త్రచికిత్సలకు సహకరించిన ఆంధ్రా హాస్పిటల్స్‌ వాళ్లకు కృతజ్నతలు చెప్పాడు మహేష్ బాబు. ఇటీవలే సమంత తోడ్పాటుతో నడిచే ‘ప్రత్యూష ఫౌండేషన్’ 15 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయించింది. ఇప్పుడు మహేష్ సాయంతో 99 మందికి జీవితాన్నందించారు. సెలబ్రెటీలు ఇలా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుండటం మంచి విషయం.