Begin typing your search above and press return to search.

యాంకర్ సుమలోని మరో కోణం

By:  Tupaki Desk   |   14 Oct 2018 9:31 AM GMT
యాంకర్ సుమలోని మరో కోణం
X
పుట్టింది కేరళలో. మాతృభాషేమో మలయాళం. కానీ సుమ తెలుగులో మాట్లాడుతుంటే మన వాళ్లకే ముచ్చటేస్తుంది. ఒక ప్రవాహంలా సాగిపోయే మాటల్ని ఇష్టపడని తెలుగు వాళ్లుండరు. రెండు దశాబ్దాలకు పైగా తనదైన యాంకరింగ్ తో కోట్లాది మందిని అలరిస్తోంది సుమ. వినోదానికి కేరాఫ్ అడ్రస్‌ గా మారిపోయిన సుమ.. అలుపెరగకుండా వందల కొద్దీ షోలు చేస్తూ సాగిపోతోంది. ఐతే ఈ మధ్య సుమలోని మరో కోణం కూడా బయటికి వచ్చింది. భారీ వరదలకు కేరళ అతలాకుతలమైన తర్వాత అక్కడ ఒక ఫ్యామిలీ హెల్త్ సెంటర్‌ ను దత్తత తీసుకుని దాన్ని బాగు చేసే పనిలో పడింది సుమ. దీంతో సుమపై ప్రశంసలు కురిశాయి. ఐతే సుమ దీంతో పాటుగా వేరే సేవా కార్యక్రమాలు కూడా చేపడుతోంది. వీటి గురించి ఇప్పటిదాకా మీడియాలో రాలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సుమ ఆ వివరాలు వెల్లడించింది.

కొన్నాళ్ల కిందట ఖమ్మంకి చెందిన ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ సుమ దగ్గరికి వచ్చి.. వృద్ధుల కోసం తాను నిర్వహిస్తున్న ఇల్లు వర్షం వచ్చినపుడు కారుతోందని.. పెద్దవాళ్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పిందట. వారి కోసం వేరే ఇల్లు కట్టేందుకు సాయపడతారా అని అడిగితే.. సుమ కొన్ని ప్రోగ్రామ్స్ చేసి డబ్బులు సమకూర్చిందట. సుమ కంటే ముందు పవన్ కళ్యాణ్ వీరి కోసం లక్ష రూపాయల సాయం చేశాడట. సుమ సేకరించిన విరాళాలు కూడా కలిపి స్థలం కొన్నారట. తర్వాత ఇంటి నిర్మాణం కోసం రాజమౌళి అత్త రాధమ్మతో పాటు ప్రభాస్.. అనుష్క.. శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. అలీ.. పీవీపీ.. ఇలా చాలామంది సాయపడ్డారట. ఇంకా వేరే సాయాలు కూడా అందాయట. ఇలా అందరి తోడ్పాటుతో ఇంటి నిర్మాణం పూర్తి చేయించిందట సుమ. అలాగే ఇప్పుడు ‘సర్వ్ నీడీ’ అనే మరో స్వచ్ఛంద సంస్థ కోసం కూడా ఇలాగే ఓ ఇల్లు నిర్మించే ప్రయత్నంలో ఉందట సుమ. ప్రచారార్భాటానికి దూరంగా ఇలాంటి మంచి పనులు చేస్తున్న సుమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.