Begin typing your search above and press return to search.

బుల్లితెర స్టార్ యాంకర్ వెండితెరపై రాణించగలదా..?

By:  Tupaki Desk   |   18 Jan 2022 1:30 PM GMT
బుల్లితెర స్టార్ యాంకర్ వెండితెరపై రాణించగలదా..?
X
బుల్లితెర మీద యాంకర్లుగా స్టార్లుగా రాణించిన చాలా మంది వెండితెరపై కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని వచ్చారు. కారణాలు ఏమైనా కానీ వీరందరూ బిగ్ స్క్రీన్ మీద రాణించలేకపోయారనే చెప్పాలి. 'జబర్దస్త్' షోతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ - గెటప్ శ్రీను వంటి వారు సినిమాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. సుధీర్ అండ్ గ్యాంగ్ ఎప్పటినుంచో దండయాత్ర చేస్తూనే ఉన్నారు కానీ.. ఎప్పటికప్పుడు బోల్తా కొట్టేస్తూనే ఉన్నారు.

'30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అంటూ వచ్చిన యాంకర్ ప్రదీప్.. సినిమా వచ్చి ఏడాది అవుతున్నా ఇంతవరకు తదుపరి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. యాంకర్ రవి కూడా హీరోగా సినిమా చేసి దెబ్బతినేశాడు. శ్రీముఖి - రష్మీ గౌతమ్ వంటి ముద్దుగుమ్మలు కూడా బిగ్ స్క్రీన్ మీద సత్తా చాటాలని ట్రై చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చాలా గ్యాప్ తర్వాత ప్రముఖ యాంకర్ సుమ కూడా సిల్వర్ స్క్రీన్ మీదకు రీఎంట్రీ ఇస్తోంది.

బుల్లితెరపై తిరుగులేని వ్యాఖ్యాతగా రాణిస్తున్న సుమ కనకాల.. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించింది. ఈ క్రమంలో అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లో తళుక్కున మెరిస్తూ వచ్చిన సుమ.. ఇప్పుడు ''జయమ్మ పంచాయతీ'' అనే పూర్తి స్థాయి సినిమాతో వెండితెర మీద సందడి చేయడానికి రెడీ అయింది.

'జయమ్మ పంచాయతీ' అనౌన్స్ మెంట్ అప్పుడు ఇది సినిమానో రియాల్టీ షో టైటిల్ లో అనే కామెంట్స్ వచ్చాయి. అయితే ఫస్ట్ లుక్ - టీజర్ మరియు సాంగ్స్ వచ్చిన తర్వాత జనాల దృష్టి మళ్లింది. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయలక్ష్మీ సమర్పణలో బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. అయితే బ్యాక్ ఎండ్ లో సుమ కూడా నిర్మాతగా వ్యవహరించారనే టాక్ ఉంది.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. అనుష్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో స్టార్ హీరోలను అగ్ర దర్శకులను భాగం చేస్తోంది సుమ. మరి స్మాల్ స్క్రీన్ మీద ప్రేక్షకులను అలరించిన సుమ 'జయమ్మ పంచాయతీ' తో బిగ్ స్క్రీన్ పైనా రాణిస్తుందేమో చూడాలి