Begin typing your search above and press return to search.

మహేష్ కోసం కబాలి బ్రదర్స్

By:  Tupaki Desk   |   5 Aug 2016 5:49 AM GMT
మహేష్ కోసం కబాలి బ్రదర్స్
X
అసలే ‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్ అయిన డిప్రెషన్లో ఉన్నాడు మహేష్ బాబు. ఇలాంటపుడు ‘కబాలి’తో లింకేంటి అంటారా..? ఐతే ఇలాంటి సెంటిమెంట్లేమీ పెట్టుకోకుండా మురుగదాస్ మాత్రం ‘కబాలి’ టెక్నీషియన్లు ఇద్దరిని మహేష్ సినిమా కోసం తీసుకున్నాడు. మన తెలుగులో రామ్-లక్ష్మణ్ బ్రదర్స్ లాగే.. తమిళంలోనూ అన్బు-అరసు అనే ఇద్దరు ఫైట్ మాస్టర్లు ఉన్నారు. వాళ్లిద్దరూ కూడా కవల సోదరులే కావడం విశేషం. ప్రస్తుతం తమిళంలో వీళ్లిద్దరూ మాంచి రైజింగ్ లో ఉన్నారు. ‘కబాలి’ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేసింది వాళ్లే. ఆ ట్విన్ బ్రదర్సే మహేష్-మురుగ సినిమాకు యాక్షన్ డిజైన్ చేస్తున్నారు. కొన్ని రోజుల కిందటే మహేష్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభమైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం హైదరాబాద్ లో నైట్ ఎఫెక్టులో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అన్బు-అరసు ఈ సినిమా కోసం స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేశారట. తొలి రోజు షూటింగ్ కోసం మహేష్ క్లాస్ గా తయారై వచ్చిన సంగతి తెలిసిందే. ఆ అవతారంలోనే ఫైట్లు చేస్తున్నాడట. మహేష్ సినిమాల్లో ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఈ ఫైట్లు ఉంటాయని అంటున్నారు. హైదరాబాద్ లో పది రోజుల షెడ్యూల్ పూర్తయ్యాక ఈ చిత్ర యూనిట్ పుణె.. ముంబయి నగరాలకు వెళ్లనుంది. అక్కడ కూడా షూటింగ్ అయ్యాక బ్రేక్ తీసుకుని.. భారీ షెడ్యూల్ కోసం గుజరాత్ కు వెళ్లబోతున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఎన్వీప్రసాద్-ఠాగూర్ మధు నిర్మాతలు.