Begin typing your search above and press return to search.

జననేత సినిమాలో జర్నలిస్ట్ అనసూయ

By:  Tupaki Desk   |   13 Nov 2018 6:40 AM GMT
జననేత సినిమాలో జర్నలిస్ట్ అనసూయ
X
రియాలిటీ షోల యాంకరింగ్ తో పాటు సినిమాలను బాలన్స్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్న అనసూయకు రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. దీని తర్వాత వరసగా వస్తున్న ఆఫర్స్ ని ఒప్పుకోకుండా సెలెక్టివ్ గా చేస్తున్న అనసూయ తాజాగా యాత్రలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. దివంగత జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర ప్రస్థానాన్ని ముఖ్య కథాంశంగా తీసుకుని రూపొందిస్తున్న ఈ మూవీలో అనసూయ ఓ ప్రత్యేక పాత్ర చేస్తోంది. ఇందులో తనది జర్నలిస్ట్ రోల్ అని ఇన్ సైడ్ టాక్. దీని తాలూకు అఫీషియల్ లుక్ బయటికి రాలేదు కానీ షూటింగ్ స్పాట్ లో ఉండగా వెనుక నుంచి తీసిన ఒక స్టిల్ ని మాత్రం అభిమానుల కోసం ట్విట్టర్ లో ప్రత్యేకంగా షేర్ చేసుకుంది అనసూయ.

సాంప్రదాయ చీర కట్టులో బ్రేక్ టైం లో తీసుకున్నట్టుగా ఉన్న ఫోటోలో అనసూయ మొహం కనిపించకపోవడం ఫ్యాన్స్ కు నిరాశ కలిగించినా మరో మంచి పాత్ర దొరికిన వైబ్రేషన్ ఉండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆనందో బ్రహ్మ ఫేమ్ మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందుతున్న యాత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. పూర్తి స్థాయి ప్రమోషన్ ఇంకా మొదలుపెట్టలేదు. మమ్ముట్టి వైఎస్ ఆర్ పాత్రలో ఒదిగిపోవడం పట్ల ఇప్పటికీ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. వర్కింగ్ స్టిల్స్ సైతం భారీ స్పందన దక్కించుకున్నాయి. యాత్రలో అనసూయ పాత్ర ఎంత పరిధిలో ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది.

డిసెంబర్ 21న విడుదల కానున్న యాత్రలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టాలను హై లైట్ చేస్తూ రూపొందిస్తున్నట్టు దర్శకుడు గతంలో స్పష్టం చేసారు. అందులోనూ పాదయాత్ర ప్రజలకు జననేతను ఎంత దగ్గర చేసింది అనేది కూడా ఇందులో చూపబోతున్నారు. కాస్ట్ అండ్ క్రూకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువ లీక్ కాకుండా జాగ్రత్త పడిన టీమ్ త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించబోతోంది.