Begin typing your search above and press return to search.

మోహన్ బాబు సినిమా..బాధ లేదన్న అనసూయ

By:  Tupaki Desk   |   6 Sept 2018 4:51 PM IST
మోహన్ బాబు సినిమా..బాధ లేదన్న అనసూయ
X
బుల్లితెరపై యాంకర్‌ గా మంచి పేరు సంపాదించిన అనసూయ.. ఆ గుర్తింపుతో సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. ఐతే ఆమె చేసిన సినిమాలన్నీ మంచి ఫలితాలివ్వలేదు. ‘క్షణం’.. ‘రంగస్థలం’ అనసూయకు ఎనలేని గుర్తింపు తేగా.. ‘విన్నర్’.. ‘గాయత్రి’ లాంటి చిత్రాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఐతే ఈ రెండు సినిమాల్లో నటించడం పట్ల తనకు ఎలాంటి రిగ్రెట్స్ లేవని ఆమె అంది. ‘విన్నర్’ సూయా సూయా పాట చేయడాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని ఆమె అంది. తన పేరు మీద పాట అంటే చిన్న విషయం కాదని.. ఎన్నేళ్లయినా మన మీద ఒక పాట ఉందనే ఆనందం నిలిచిపోతుందని ఆమె చెప్పింది.

ఇక ‘గాయత్రి’ సినిమాకు వస్తే మోహన్ బాబు లాంటి లెజెండరీ నటుడితో నటించిన అనుభవం ఎప్పటికీ గుర్తుండి పోతుందని.. ఈ అవకాశం అందరికీ రాదని ఆమె అంది. ఈ చిత్రంలో తాను జర్నలిస్ట్ పాత్ర చేశానని.. తాను కూడా మీడియా నుంచే వచ్చానని.. తన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఆ పాత్రను చాలా సహజంగా.. బాగా చేశావని అభినందించారని.. ఆ ప్రశంసలు తనకు చాలని అనసూయ చెప్పింది. ‘గాయత్రి’ సినిమా ఆడియో వేడుకలో మోహన్ బాబు తనను ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడ్డంపై ఆమె స్పందిస్తూ.. కొందరు ఎంత వయసు వచ్చినా వారి మనసు మాత్రం ఇంకా యవ్వనంతోనే ఉంటుందని.. మోహన్ బాబు కూడా అలాంటి వారే అని.. ఇలా ఫ్లర్ట్ చేస్తే ఎవరికైనా ఆనందమే అని ఆమె అంది. ఇంతకుముందు తనకు గ్లామర్ ఇమేజ్ ఉండేదని.. కానీ ‘క్షణం’.. ‘రంగస్థలం’ సినిమాలు ఆ ముద్రను చెరిపేశాయని.. ‘రంగస్థలం’ విడుదల సమయంలో తనను కొందరు రంగమ్మత్త అంటే ఫీలయ్యేదాన్నని.. కానీ తర్వాత మాత్రం ఆ మాటను ఎంజాయ్ చేస్తున్నానని అనసూయ చెప్పింది.