Begin typing your search above and press return to search.

అనంత శ్రీరామ్ స్పీచ్ పేలిపోయింది

By:  Tupaki Desk   |   8 July 2018 7:26 AM GMT
అనంత శ్రీరామ్ స్పీచ్ పేలిపోయింది
X
తెలుగులో ఈ తరం అత్యుత్తమ గీత రచయితల్లో అనంత్ శ్రీరామ్ ఒకడు. అతడి స్థాయి ఏంటో చాటిచెప్పే పాటలు పదుల సంఖ్యలో ఉన్నాయి. బీటెక్ చదువు మధ్యలో వదిలేసి గీత రచయితగా మారిన అనంత్.. గత దశాబ్దంన్నర కాలంలో వందల పాటలు రాశాడు. ఇప్పుడతను తన కెరీర్లోనే ‘ది బెస్ట్’ అనిపించే పాట రాశాడు. ‘సాక్ష్యం’ సినిమా కోసం పంచ భూతాల మీద అతను రాసిన పాట వింటే ఒళ్లు గగుర్పొడుస్తుందంటే అతిశయోక్తి కాదు. ఈ పాట గురించి వివరిస్తూ ‘సాక్ష్యం’ ఆడియో వేడుకలో అతను ఇచ్చిన లెంగ్తీ స్పీచ్ అదిరిపోయింది. ఈ పాట గురించి అతను పది నిమిషాలకు ప్రసంగించాడు. అలాగని ఎక్కడా బోర్ కొట్టించలేదు.

క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలో టైటిల్ సాంగ్ గురించి సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రస్తావిస్తూ.. ‘ఈ పాట రాయడానికే 28 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానేమో’ అని అన్నారని.. అందరూ అంత మాట అనేంత గొప్పదనం ఆ పాటలో ఏముందా అని ఎదురు చూశారని.. కానీ తాను మాత్రం తాను ఇలా అనే పాట తనకు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశానని.. ఎట్టకేలకు ‘సాక్ష్యం’ సినిమాతో తనకు ఆ అవకాశం వచ్చిందని చెప్పాడు అనంత్. సీతారామశాస్త్రి అవతార పురుషుడి గురించి రాస్తే తాను పంచ భూతాల గురించి పాట రాశానన్నాడు. ఆ పాటలోని పంక్తుల్ని ప్రస్తావిస్తూ పంచ భూతాల గొప్పదనం గురించి అనంత్ అద్భుత రీతిలో వివరించాడు. ఈ పాట రాసినందుకు తాను కొంందరికి కృతజ్ఞతలు చెప్పాలని అంటూ.. ‘‘ఇలాంటి బలమైన పాటను బక్కగా ఉన్న నాతో రాయించాలని ఆలోచించినందుకు దర్శకుడికి.. పంచ భూతాల గురించి పాట రాసే అవకాశాన్ని ఈ బూతద్దాలవాడికి ఇచ్చినందుకు చిత్ర బృందానికి.. ఇంత అద్భుతమైన పాటను నాలాంటి అర్భకుడు రాసే వీలు కల్పించినందుకు నిర్మాత అభిషేక్ కు...’’ ఇలా ప్రాస కలుపుతూ భలేగా మాట్లాడాడు అనంత్. తాను రాసిన పాటను స్టేజ్ మీద పెర్ఫామ్ చేసినపుడు ఆడిటోరియంలో ఉన్న వాళ్లు ఎలా అయితే స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారో.. రేప్పొద్దున సినిమాలో పతాక సన్నివేశం చూసి థియేటర్లలో కూడా అలాగే స్టాండింగ్ ఒవేషన్ ఇస్తారని అనంత్ జోస్యంచెప్పాడు.