Begin typing your search above and press return to search.

గన్ మిస్‌ ఫైర్.. బిగ్ బాస్ సన్నీకి బుల్లెట్ గాయాలు

By:  Tupaki Desk   |   12 May 2023 5:59 PM GMT
గన్ మిస్‌ ఫైర్.. బిగ్ బాస్ సన్నీకి బుల్లెట్ గాయాలు
X
చాలా కాలం క్రితమే యాంకర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. బిగ్ బాస్ షోలో విజేతగా నిలిచి ఎనలేని ఫాలోయింగ్‌ను తెచ్చుకున్నాడు వీజే సన్నీ. ఈ షో తర్వాత అతడి కెరీర్‌కు మంచి ఊపు వచ్చిందనే చెప్పాలి. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ టాలెంటెడ్ కుర్రాడు 'ATM' అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించాడు. అలాగే, ఎన్నో సినిమాల్లోనూ హీరోగా నటిస్తున్నాడు.

బిగ్ బాస్ సన్నీ ప్రస్తుతం 'అన్‌స్టాపబుల్' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. 'పిల్లా నువ్వు లేని జీవితం', 'ఈడో రకం ఆడో రకం' వంటి చిత్రాలకు రచయితగా పని చేసి.. 'సన్ ఆఫ్ ఇండియా' మూవీతో డైరెక్టర్‌గా మారిన డైమండ్ రత్నబాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నారు.

ఫుల్ లెంగ్త్ కామెడీ జోనర్‌లో రాబోతున్న 'అన్‌స్టాపబుల్' మూవీని జూన్ 9న ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని అనుకున్నారు. ఇందుకోసం తాజాగా ఓ ప్రోమోను షూట్ చేస్తుండగా.. అందులో సినిమా హీరో వీజే సన్నీకి అనుకోని ప్రమాదం జరిగింది.

తాజాగా 'అన్‌స్టాపబుల్' మూవీ రిలీజ్ డేట్‌పై ఓ ప్రోమోను షూట్ చేస్తున్నారు. అందులో సప్తగిరి 'అన్‌స్టాపబుల్ రిలీజ్ ఎప్పుడు' అని 30 ఇయర్స్ పృథ్వీని గన్‌తో బెదిరించాడు. అప్పుడాయన వాడిని అడుగు అంటూ హీరో వైపు చూపించాడు. అప్పుడు అనుకోకుండా సప్తగిరి చేతిలో గన్ పేలి ఎదురుగా ఉన్న సన్నీకి అందులోని డమ్మీ బుల్లెట్ తగిలింది.

షూటింగ్ సమయంలో వాడే డమ్మీ గన్‌ను వాడినా.. సన్నీ దగ్గరగా ఉండడంతో బుల్లెట్ గట్టిగా తగిలినట్లు తెలిసింది. దీంతో అతడి మెడ భాగంలో గాయం అయినట్లు సమాచారం. ఆ వెంటనే చిత్ర యూనిట్ సన్నీని ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.

అయితే, ఇది నిజంగానే జరిగింది? ప్రమోషన్‌లో భాగంగా క్రియేట్ చేశారా? అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.