Begin typing your search above and press return to search.

ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ పై తొలి చిత్రం.. 29న విడుద‌ల‌

By:  Tupaki Desk   |   28 April 2020 1:30 AM GMT
ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ పై తొలి చిత్రం.. 29న విడుద‌ల‌
X
ప్ర‌స్తుతం క‌రోనా క‌ట్ట‌డిలో భాగంగా లాక్‌ డౌన్ పొడ‌గించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌ట్లో ప‌రిస్థితులు స‌ద్దుమ‌ణిగేలా లేవు. లాక్‌డౌన్‌తో ఇప్ప‌టికే తీవ్ర న‌ష్టాల్లో సినీ ప‌రిశ్ర‌మ కూరుకుపోయింది. సినీ ప‌రిశ్ర‌మ‌లోని 24 క్రాప్ట్స్ మూత‌ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఎలాంటి కార్య‌క‌లాపాలు కొన‌సాగ‌డం లేదు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే విడుద‌ల చేయాల‌ని సిద్ధంగా ఉన్న సినిమాలు మాత్రం తీవ్రంగా న‌ష్ట‌పోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో సినీ రంగానికి చెందిన వారు ప్ర‌త్యామ్నాయ వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ క్ర‌మంలో వారికి డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్ స‌రైన వేదిక‌గా భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై తొలి తెలుగు చిత్రం విడుద‌ల కానుండ‌డం విశేషం. ఈనెల 29వ తేదీన ‘అమృతరామమ్’ అనే సినిమా జీ 5 లో విడుద‌ల కానుంది.

పద్మజ ఫిల్మ్స్ఇండియా ప్రైవేటు లిమిటెడ్ - సినిమావాలా పతాకంపై నిర్మించిన ఈ సినిమా వాస్త‌వంగా ఉగాది పండుగ సంద‌ర్భంగా విడుదల కావాల్సి ఉంది. అయితే అప్ప‌టికే దేశంలో ప‌రిస్థితులు మారిపోయాయి. కరోనా క‌ట్ట‌డిలో భాగంగా లాక్‌డౌన్ విధించ‌డంతో థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. సినీ కార్య‌క‌లాపాల‌న్నీ ఆగిపోయాయి. అయితే అప్ప‌టికే సిద్ధ‌మైన అమృత‌రామ‌మ్ సినిమా విప‌త్క‌ర‌ పరిస్థితుల నేప‌థ్యంలో విడుద‌ల ఆగిపోయింది. ఈ క్ర‌మంలో జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించినట్లు దర్శకుడు సురేందర్ కొంటాడి ప్ర‌క‌టించారు.

థియేటర్లలో విడుద‌ల కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న తొలి తెలుగు చిత్రం ‘అమృతరామమ్’ అని ఈ సంద‌ర్భంగా నిర్మాత తెలిపారు. ఈ క్ర‌మంలో సినిమా క‌థాంశం వివ‌రించారు. ఇప్పటిదాకా ప్రేమకథల్లో హీరోలే త్యాగాలు చేస్తుండ‌గా.. హీరోయిన్ పిచ్చిగా ప్రేమిస్తే ఎలా ఉంటుందో అన్నదే ఈ సినిమాలో క‌థాంశం అని తెలిపారు. అమితా రంగనాథ్, రామ్ మిట్టకంటి న‌టీన‌టులుగా నటించిన ఈ చిత్రానికి ఎన్.ఎస్. ప్రసు సంగీతం అందించారు. సంతోశ్‌ షనోని డీఓపీగా వ్యవహరించారు. విడుద‌లైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.

విప‌త్క‌ర ప‌రిస్థితుల నేప‌థ్యంలో థియేటర్లలో సినిమా విడుదల కావడం క‌ష్ట‌మేన‌ని గుర్తించి ఓటీటీ ఎంచుకున్న‌ట్లు తెలిపారు. ప్రేక్షకులు అర్థం చేసుకుని సినిమాను ఓటీటీలో ఆద‌రిస్తార‌ని భావిస్తున్నట్లు తెలిపారు. ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో సినిమాను చూసి ఆనందించాల‌ని ఆ సినిమా బృందం కోరింది. డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌పై విడుద‌ల అవుతున్న తొలి తెలుగు సినిమాను చూసి ఆనందించండి.