Begin typing your search above and press return to search.

అమ్రిష్ పురి.. భార‌తీయ సినీచ‌రిత్ర‌లో మ‌రొక‌డు లేనే లేడు!

By:  Tupaki Desk   |   22 Jun 2023 9:38 PM GMT
అమ్రిష్ పురి.. భార‌తీయ సినీచ‌రిత్ర‌లో మ‌రొక‌డు లేనే లేడు!
X
బాలీవుడ్ స‌హా టాలీవుడ్ లో చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో న‌టించిన మేటి న‌టుడు అమ్రిష్ పురి. తనదైన విల‌క్ష‌ణ నటనతో విలనిజానికి కొత్త పుంతులు తొక్కించిన అరుదైన ప్ర‌తిభావంతుడు ఆయ‌న‌. కెరీర్ తొలినాళ్ల‌లో శేఖర్ కపూర్ తెరకెక్కించిన 'మిస్టర్ ఇండియా' (శ్రీ‌దేవి-అనీల్ క‌పూర్) సినిమాలో మొగాంబో పాత్ర‌తో గొప్ప పాపులారిటీ సంపాదించారు. నాగిన్ -కరణ్ అర్జున్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన విలనిజంతో మెప్పించారు. తెలుగులో ఆఖరి పోరాటం-జగదేక వీరుడు అతిలోక సుందరి-ఆదిత్య 369 వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో తనదైన విలనిజం పండించి అద్భుత ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నారు.

భారతీయ చిత్ర పరిశ్రమలో విలనిజానికి నిలువెత్తు రూపంగా అమ్రీష్ పురిని అభిమానించారు. హిందీ సినిమాల్లో ఎన్నో చిత్రాల్లో ప్ర‌తినాయకుడిగా న‌టించి మెప్పించిన ఆయ‌న స‌హాయ న‌టుడిగాను త‌న‌దైన ఒర‌వ‌డిని సృష్టించారు. కొన్ని పాత్ర‌ల్లో అత‌డి న‌ట‌న కంట‌త‌డి పెట్టిస్తుంది. ఏ పాత్ర తీసుకున్న అందులో తనదైన నటనతో పాత్రలకు జీవం పోయడం అమ్రీష్ పురి ప్రత్యేకత. అత‌డి ఆహార్యం ఎంతో విల‌క్ష‌ణ‌మైన‌ది. విల‌న్ గా రంగ ప్ర‌వేశం చేస్తే అత‌డు ఒదిగిపోయే తీరుకు ఎదుట ఉన్న‌ది ఎవ‌రైనా ఝ‌డ‌వాల్సిందే. కెరీర్ లో దాదాపు 400కు పైన చిత్రాల్లో నటించి మెప్పించిన మేటి న‌టుడు ఆయ‌న‌. హిందీ సినిమాలు చేస్తూనే.. తెలుగు- కన్నడ- తమిళ సినిమాలు చేసారు.

టాలీవుడ్ లో అసాధార‌ణ ఫాలోయింగ్:

తెలుగులో మొదటిసారి ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'ఆఖరి పోరాటం' సినిమాలో నటించారు. నాగార్జున- శ్రీదేవి ఈ చిత్రంలో నాయ‌కానాయిక‌లు. ఈ చిత్రంలో స్వామిజీ పాత్రలో తనదైన నటనతో అదరగొట్టిన అమ్రీష్ పురి ఆ త‌ర్వాత కూడా అదే త‌ర‌హా పాత్ర‌ల్లో వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శించి ఆక‌ట్టుకున్నారు. చిరంజీవి- శ్రీదేవి నాయ‌కానాయిక‌లుగా నటించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమాలో మహాద్రష్టగా అసాధార‌ణ‌ నటనతో మైమ‌రిపించారు. మాంత్రికుడికి ప్ర‌తిరూపం అమ్రిష్ పురి అంటే న‌మ్మాల్సిందే. విల‌న్ గా అత‌డి ఆహార్యం చూస్తే చిన్న పిల్ల‌లు ఝ‌డుసుకునేవారు. అంత‌టి ప్ర‌భావ‌వంత‌మైన రూపం ఆహార్యం అత‌డి సొంతం. బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆదిత్య 369'లో రాజ వర్మ పాత్రలో విలనిజం పండించిన అమ్రీష్ పురిని నేటికీ నాటి యువ‌త‌రం మ‌ర్చిపోలేరు.

ఇక అమ్రిష్ పురి యాస భాష శైలి తెలుగు వారిని విశేషంగా ఆక‌ట్టుకుంది. అత‌డి మాట‌లో విల‌క్ష‌ణ‌త ఇక్క‌డ ప్ర‌త్యేక‌త‌ను ఆపాదించుకుంది. కొండవీటి దొంగలో ఖాద్రాగా- ఎస్పీ యుగంధర్ గా తన విశిష్ట నటనతో అదరగొట్టిన అమ్రీష్ పురి తెలుగులో చిరంజీవి-నాగార్జున‌-బాల‌కృష్ణ వంటి అగ్ర హీరోల సినిమాల్లో న‌టించారు. బాలయ్యతో అశ్వమేథం-నిప్పురవ్వ సినిమాల్లో విలన్‌గా నటించారు అమ్రీష్ పురి. అశ్వమేథంలో అమ్రిష్ ద్విపాత్రాభిన‌యం బెంచ్ మార్క్ అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'మేజర్ చంద్రకాంత్' తెలుగులో అమ్రీష్ పురి చివరి సినిమా. ఏడెనిమిది సినిమాల్లో అత‌డు విల‌నీ పండించారు.

అమ్రీష్ పూరి 91వ జన్మదినోత్సవం సందర్భంగా చాలామందికి తెలియ‌ని అరుదైన విష‌యాలు.....

*దిగ్గజ నటుడు తొలిసారిగా తెరపైకి బట్టతల తో క‌నిపించింది ఒక హాలీవుడ్ సినిమాలో. స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వం వహించిన 1984 హాలీవుడ్ చిత్రం 'ఇండియానా జోన్స్ అండ్ ది టెంపుల్ ఆఫ్ డూమ్' కోసం అమ్రిష్ పురి బట్టతల రూపంతో క‌నిపించాడు. దానిని అతను అనేక చిత్రాలలో ఉపయోగించాడు.

*కెరీర్ లో లెక్కలేనన్ని ప్ర‌యోగాత్మ‌క‌ పాత్రలకు జీవం పోసిన దిగ్గజ నటుడు అమ్రీష్ పూరి ఐకానిక్ చిత్రం 'మిస్టర్ ఇండియా'లో నటించే అవకాశాన్ని దాదాపు తిరస్కరించారు. అనిల్ కపూర్- శ్రీదేవి నటించిన 1987 సూపర్-హిట్ చిత్రంలో మొగాంబో పాత్ర పోషించిన అమ్రిష్ పూరి ఆ పాత్రను అంగీకరించే ముందు చాలా ఆలోచించాన‌ని ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. అప్పటికే సగానికి పైగా చిత్రీకరణ పూర్తికావడంతో న‌టించేందుకు కాస్త తడబడ్డానని ఒప్పుకున్నాడు. మిస్ట‌ర్ ఇండియా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో 15-20 రోజులు పగటి వెలుగు చూడలేదని నాటి షూటింగ్ షెడ్యూల్ చాలా కష్టమైన‌వని అమ్రిష్ పురి తెలిపారు. ఈ చిత్రాన్ని RK స్టూడియోస్ లో భారీ సెట్లో తెర‌కెక్కించారు. మొగాంబో పాత్ర‌లో జీవించిన అత‌డికి చివరికి మరణానికి దారితీసేంత‌గా అందులో లీనమై ప‌ని చేసాడ‌ట‌.

*భారతదేశంలోని పంజాబ్ లో 22 జూన్ 1932న జన్మించిన అమ్రిష్ పూరి తన శక్తివంతమైన విజృంభించే గాత్రం ఘాడ‌మైన‌ ప్రదర్శనలతో వెండితెరపై చెరగని ముద్ర వేశారు. అతను మిస్టర్ ఇండియాలో భయంకరమైన మొగాంబో నుండి దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగేలో తెలివైన దయగల బల్దేవ్ సింగ్ వరకు అనేక రకాల పాత్రలను పోషించాడు.

*తన మాగ్నెటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయగల పూరీ సామర్థ్యం అతన్ని భారతీయ సినిమాలో ప్రియమైన న‌టుడిగా చేసింది. మిస్టర్ ఇండియా ఘన విజయంతో అమ్రిష్ పూరి కీర్తి కొత్త శిఖరాలకు చేరుకుంది. సైన్స్ ఫిక్షన్- యాక్షన్- డ్రామా కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది . కల్ట్ హోదా పొందిన చిత్ర‌మిది. మొగాంబోగా పూరి నటన అతని ఐకానిక్ క్యాచ్ ఫ్రేజ్ ''మొగాంబో ఖుష్ హువా''తో తరతరాలుగా సినీ ప్రేక్షకుల జ్ఞాపకాలలో నిలిచిపోయాడు.