Begin typing your search above and press return to search.

వెన్నులో వ‌ణుకు పుట్టించే విల‌నీ క‌టౌట్‌!

By:  Tupaki Desk   |   22 Jun 2021 6:00 PM IST
వెన్నులో వ‌ణుకు పుట్టించే విల‌నీ క‌టౌట్‌!
X
వెండి తెరపై హీరోల‌కు ఫ్యాన్స్ ఉండ‌డం స‌హ‌జం.. కానీ విల‌న్ కు ఫ్యాన్స్ ఉంటారా? ఉంటార‌ని నిరూపించిన ప్ర‌తినాయ‌కుడు అమ్రీష్ పురి. మిగిలిన విల‌న్లంతా ఒకెత్త‌యితే.. అమ్రీష్ పురి ఒకెత్తు అన్న‌ట్టుగా ఉండేది అప్ప‌ట్లో. ఆయ‌న భారీ దేహం.. చూడ‌గానే విలనే అనిపించే ఆహార్యం.. వీటికితోడు గంభీర‌మైన‌ వాయిస్‌. ఆ మాడ్యులేష‌న్ కూడా విభిన్నంగా ఉండ‌డంతో జ‌నాల‌కు విప‌రీతంగా న‌చ్చేసింది. ఇంకేముందీ..? విలన్ అంటే.. ఇలాగే ఉండాలి అని అన్నారు సినీ ప్రేక్ష‌కులు. దీంతో.. మూవీ మేక‌ర్స్ అంతా అమ్రిష్ పురీ ఇంటికి క్యూ క‌ట్టేవారు.

బాలీవుడ్ న‌టుడే అయినా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు సైతం ఎంతో సుప‌రిచితుడు అమ్రీష్ పురి. బాలీవుడ్లో కెరీర్ మొద‌లు పెట్టిన త‌ర్వాత 1987లో వ‌చ్చిన ‘మిస్ట‌ర్ ఇండియా’ చిత్రంలో ఆయ‌న పోషించిన ప్ర‌తినాయ‌క పాత్ర‌.. కెరీర్ ను మార్చేసిందనే చెప్పాలి. ఈ చిత్రంలో హీరోగా న‌టించిన అనిల్ క‌పూర్ క‌న్నా ఎక్కువ మార్కులు.. అమ్రీష్ పురికే ద‌క్కాయంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌లా మెస్మ‌రైజ్ చేశారు.

ఆ త‌ర్వాత ఆయ‌న వెను దిరిగి చూసుకోలేదు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో విల‌న్ గా న‌టించారు. న‌టించిన ప్ర‌తీ చిత్రంలో త‌న‌దైన ముద్ర వేశారు. ఆ విధంగా.. అమ్రీష్ త‌మ‌ సినిమాలో ఉన్నాడంటే.. ఆ చిత్రానికి నిండుద‌నం వ‌చ్చిన‌ట్టే అని భావించేవారు మేక‌ర్స్‌. దీంతో.. తెలుగు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు సైతం ఆయ‌న ఇంపోర్ట్ చేసుకున్నారు.

తెలుగులో జ‌గ‌దేక వీరుడు - అతిలోక సుంద‌రి, మేజ‌ర్ చంద్ర‌కాంత్‌, కొండ‌వీటి దొంగ‌, ఆదిత్య 369, అశ్వ‌మేథం, ఆఖ‌రి పోరాటం వంటి చిత్రాల్లో న‌టించి స‌త్తా చాటారు అమ్రీష్‌. ఇందులోని ప్ర‌తీ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిల‌వ‌డం విశేషం. ఈ సినిమాల్లో ఆయన పోషించిన ప్ర‌తీ పాత్ర కూడా ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంది.

ఈ విధంగా.. సుమారు మూడు ద‌శాబ్దాల‌పాటు సినీ కెరీర్ ను కొన‌సాగించిన అమ్రీష్‌.. ఎన్నో మ‌ర‌పురాని, మైలురాయి వంటి చిత్రాల్లో న‌టించారు. 72 ఏళ్ల వ‌య‌సులో 2005లో తుది శ్వాస విడిచారు. ఇవాళ ఆయ‌న జ‌యంతి. ఈ సంద‌ర్భంగా ఆ మ‌హాన‌టుడికి నివాళి.