Begin typing your search above and press return to search.

జేడీ హీరో.. అమ్మ రాజశేఖర్ దర్శకుడు

By:  Tupaki Desk   |   18 March 2017 9:14 AM GMT
జేడీ హీరో.. అమ్మ రాజశేఖర్ దర్శకుడు
X
ప్రభుదేవా.. రాఘవ లారెన్స్.. వీళ్ల కోవలోనే నృత్య దర్శకత్వం నుంచి దర్శకత్వం వైపు మళ్లాడు అమ్మ రాజశేఖర్. అతను దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘రణం’ అప్పట్లో సూపర్ హిట్టయింది. వెంటనే రవితేజ లాంటి స్టార్ హీరోతో పని చేసే అవకాశం దక్కింది అమ్మ రాజశేఖర్ కు. కానీ మాస్ రాజాతో అతను చేసిన ‘ఖతర్నాక్’ అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఒకట్రెండు సినిమాలు చేశాడు కానీ.. అవేమీ సరైన ఫలితాన్నివ్వలేదు. చివరగా వచ్చిన ‘రణం-2’ అడ్రస్ లేకుండా పోయింది. ఐతే ఈసారి చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ తన దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు అమ్మ రాజశేఖర్.

రాజశేఖర్ కొత్త సినిమాలో జేడీ చక్రవర్తి కథానాయకుడిగా నటిస్తుండటం విశేషం. వీళ్లిద్దరి కాంబినేషన్ అసలు ఊహకు అందనిది. నటుడిగా ఎంతో అనుభవమున్న జేడీ.. దర్శకుడిగానూ కొన్ని సినిమాలు తీశాడు. అతను అమ్మ రాజశేఖర్ సినిమాకు ఓకే చెప్పడం విశేషమే. ముందు రాజశేఖర్ తన దగ్గరికి ఓ కథతో వచ్చాడని.. అది విని తాను కొన్ని కరెక్షన్లు చెప్పానని.. ఆ మార్పులతో స్క్రిప్టును అద్భుతంగా చేసుకుని వచ్చాడని చెప్పాడు జేడీ. మంచి సినిమా చేయాలన్న ఉద్దేశంతోనే దర్శకుడిగా తాను చాలా గ్యాప్ తీసుకున్నానని.. జేడీ తనకు నృత్య దర్శకుడిగా అవకాశాలిచ్చిన గురువు అని.. ఆయనతో కలిసి కచ్చితంగా హిట్టు కొడతానని అన్నాడు అమ్మ రాజశేఖర్. ఓ కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/