Begin typing your search above and press return to search.

కేబీసీ 9 పై బిగ్ బీ ట్వీట్!

By:  Tupaki Desk   |   8 Aug 2017 4:24 PM GMT
కేబీసీ 9 పై బిగ్ బీ ట్వీట్!
X
కంప్యూట‌ర్ జీ......లాక్ కియా జాయే.....అంటూ త‌న గంభీర‌మైన వాయిస్ తో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. టీవీషోల‌లో సంచ‌ల‌నం రేపిన కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి 9 తో మ‌రోసారి బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు మెప్పించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. కేబీసీ 9 షూటింగ్ ప్రారంభ‌మైంద‌ని ఈ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అమితాబ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

మూడు సంవత్స‌రాల త‌ర్వాత కేబీసీ కార్య‌క్ర‌మం పునఃప్రారంభం కాబోతోంది. కేబీసీ 9 సెట్లో షూటింగ్ జ‌రుగుతున్న ఫొటోల‌ను అమితాబ్‌ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. కొన్ని సరికొత్త హంగుల‌తో 9వ‌ సీజ‌న్ లో ప్రేక్ష‌కులను అల‌రించ‌బోతున్నారు నిర్వాహ‌కులు. కేబీసీ 8 త‌ర‌హాలోనే షో ప్రాథమిక నియ‌మాల్లో పెద్ద‌గా మార్పులేమీ లేకున్నా, టెక్నిక‌ల్ అంశాల‌కు ఈ సీజ‌న్ లో ఎక్కువ ప్రాధాన్య‌తనివ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

పార్టిసిపెంట్‌కు స‌హాయంగా త‌మ‌కు న‌చ్చిన ఒక వ్య‌క్తిని(జోడీదార్‌) ఆడియ‌న్స్‌లో కూర్చోబెట్ట‌వ‌చ్చు. పార్టిసిపెంట్ కు ఆ జోడీదార్ ఒక‌సారి సాయం చేసే అవ‌కాశ‌ముంటుంది. గ‌తంలో ఉన్న‌ ఫోన్ ఎ ఫ్రెండ్ ఆప్ష‌న్ కు అద‌న‌పు హంగులు చేర్చారు. ఈ సారి పోన్ ఎ ఫ్రెండ్ ద్వ‌రా పార్టిసిపెంట్లతో అవ‌త‌లి వ్య‌క్తి వీడియో కాల్ లో సంభాషించ‌వ‌చ్చు. గ‌తంలో క‌న్నా ఈ సీజ‌న్ లో ప్ర‌శ్న‌ల సంఖ్య పెంచ‌నున్నట్లు తెలుస్తోంది. త‌ద్వారా అన‌వ‌స‌ర డ్రామాను త‌గ్గించాల‌ని నిర్వాహ‌కులు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ సీజ‌న్ లో పార్టిసిపెంట్లు కోటి రూపాయ‌లు గెలుచుకున్నత‌ర్వాత ఏడు కోట్లు గెలుచుకోవ‌డానికి సంబంధించి ఒక జాక్ పాట్ ప్ర‌శ్న‌ను అడుగుతారు. ఆ సంద‌ర్భంలో ఎటువంటి లైఫ్ లైన్ లు ప‌నిచేయ‌వు. అంతేకాకుండా ఆ ప్ర‌శ్న‌కు త‌ప్ప‌నిస‌రిగా స‌మాధానం చెప్ప‌వ‌ల‌సి ఉంటుంది. ఒక వేళ స‌మాధానం చెబితే ఒక నిర్ణీత మొత్తం మాత్ర‌మే చెల్లిస్తారు. వారు గెలుచుకున్న కోటి రూపాయ‌ల‌ను కోల్పోతారు. అయితే, ఈ జాక్ పాట్ ప్ర‌శ్న తీసుకోవాలా? వ‌ద్దా? అన్న‌ది పార్టిసిపెంట్ల ఇష్ట‌ప్ర‌కార‌మే ఉంటుంది.

కేబీసీ 9 కు రిజిస్ట్రేష‌న్లు జూన్ నెల నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. దాదాపు 2 కోట్ల మంది ఎంట్రీలు పంపిన‌ట్లు తెలుస్తోంది. సోనీ టీవీలో సెప్టెంబ‌ర్ రెండో వారం నుంచి ఈ షో ప్రారంభం కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సారి ఆరు వారాల పాటు కేవ‌లం 30 ఎపిసోడ్లలో ఈ షో ప్రసారం కానుంది. ఈ షో త‌ర‌హాలోనే తెలుగులో `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు` కార్య‌క్ర‌మాన్ని రూపొందించిన సంగ‌తి తెలిసిందే. తెలుగులో ఈ షోకు మొద‌ట నాగార్జున‌, త‌ర్వాత చిరంజీవి వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.