Begin typing your search above and press return to search.

అమీర్ ఖాన్ అక్క‌డ దుమ్ముదులిపేస్తున్నాడు!

By:  Tupaki Desk   |   24 Aug 2022 9:33 AM GMT
అమీర్ ఖాన్ అక్క‌డ దుమ్ముదులిపేస్తున్నాడు!
X
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన లేటెస్ట్ మూవీ 'లాల్ సింగ్ చ‌డ్డా'. అద్వైత్ చంద‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వ‌యాకామ్ 18 పిక్చ‌ర్స్, అమీర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ ల‌పై అమీర్‌ఖాన్ , కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే నిర్మించారు. క‌రీనా క‌పూర్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీతో టాలీవుడ్ హీరో నాగ‌చైత‌న్య బాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే. హాలీవుడ్ మూవీ 'ఫారెస్ట్ గంప్‌' ఆధారంగా దాదాపు రూ. 180 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించారు.

'థంగ్స్ ఆఫ్ హిందూస్తాన్‌' దారుణంగా బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింది. దీంతో దాదాపు నాలుగేళ్లు విరామం తీసుకున్న అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చ‌ద్దా'పై భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు. అత్యంత భారీ స్థాయిలో ఆగ‌స్టు 11న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ మూవీ ఇండియా వైడ్ గా అమీర్ ఖాన్ కెరీర్ లోనే అత్యంత భారీ డిజాస్ట‌ర్ గా నిలిచింది.

'బాయ్ కాట్ ల‌ల్ సింగ్ చ‌డ్డా' అంటూ ఈ మూవీ రిలీజ్ కు నెల రోజుల ముందు నుంచే ట్విట్ట‌ర్ లో జోరుగా ప్ర‌చారం ఊపందుకోవ‌డంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది.

బాయ్ కాట్ నినాదం కార‌ణంగా ఈ మూవీ ప్ర‌ద‌ర్శిస్తున్న థియేట‌ర్ల వ‌ద్ద పెద్ద‌గా జ‌నం క‌నిపించ‌లేదు. దీంతో కొన్ని షోల‌ని అర్థాంత‌రంగా ర‌ద్దు చేయాల్సి వ‌చ్చిందంటే బాయ్ కాట్ నినాదం ఈ మూవీపై ఎంత‌టి ప్ర‌తికూల ఫ‌లితాన్ని అందించిందో అర్థం చేసుకోవ‌చ్చు. రూ. 180 కోట్ల బ‌డ్జెట్ తో భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ ఇండియా వైడ్ గా బాక్సాఫీస్ వ‌ద్ద కేవ‌లం రూ.60 కోట్లు మాత్ర‌మే రాబ‌ట్టి అమీర్ కెరీర్ లోనే అత్యంత డిజాస్ట‌ర్ గా నిలిచి షాకిచ్చింది.

అయితే విదేశాల్లో మాత్రం ఈ మూవీ వ‌సూళ్ల ప‌రంగా అక్క‌డ దుమ్ముతులిపేస్తోంది. ఈ ఏడాది విదేశాల్లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన హిందీ చిత్రంగా 'లాల్ సింగ్ చ‌డ్డా' నిలిచి స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. ఓవ‌ర్సీస్ లో 7.5 మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ట్ చేసి 'గంగూబాయి క‌తియావాడి' (7.47 మిలియ‌న్ డాల‌ర్స్‌), 'భూల్ భూల‌య్యా 2 (5.88 మిలియ‌న్ డాల‌ర్స్‌) పేరిట వున్న రికార్డుని చెరిపేసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 1.26 కోట్ల‌ను వ‌సూలు చేసింది.

దీంతో మేక‌ర్స్ కొంత వ‌ర‌కు ఊపిరి పీల్చుకుంటున్నార‌ట‌. ఇండియా వైడ్ గా బాయ్ కాట్ నినాదం కార‌ణంగా భారీ స్థాయిలో న‌ష్ట‌పోయిన 'లాల్ సింగ్ చ‌డ్డా' విదేశాల్లో మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద త‌న ప్ర‌తాపాన్ని చూపిస్తూ దుమ్ముదులిపేస్తుండ‌టం విశేషం అని బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.