Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : అమిగోస్

By:  Tupaki Desk   |   10 Feb 2023 12:38 PM GMT
మూవీ రివ్యూ : అమిగోస్
X
'అమిగోస్' మూవీ రివ్యూ
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్-ఆషికా రంగనాథ్-బ్రహ్మాజీ-జయప్రకాష్-సప్తగిరి తదితరులు
సంగీతం: జిబ్రాన్
ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్
మాటలు: సురేంద్ర కృష్ణ-రవిరెడ్డి మల్లు-సుధాకర్ రెడ్డి ఏరువ
నిర్మాతలు: వై.రవిశంకర్-నవీన్ ఎర్నేని
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజేందర్ రెడ్డి

గత ఏడాది 'బింబిసార' చిత్రంతో ఘనవిజయాన్నందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇంకో ఆరు నెలలకే దానికి పూర్తి భిన్నమైన 'అమిగోస్' అనే చిత్రంతో అతను ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం.. సినిమాగా ఎంతమేర ఆకట్టుకుందో చూద్దాం పదండి.


కథ:

చూడ్డానికి అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండే సిద్దార్థ్.. మంజునాథ్.. మైకేల్.. మనుషులను పోలిన మనుషులను కలిపే ఒక వెబ్ సైట్ ద్వారా కలుస్తారు. వీరిలో సిద్దార్థ్.. రేడియో జాకీ అయిన ఇషికా (ఆషికా రంగనాథ్)ను ప్రేమిస్తాడు. మంజునాథ్.. మైకేల్ సాయంతో సిద్ధార్థ్.. ఇషికాను మెప్పించి ఆమె తన ప్రేమలో పడేలా చేస్తాడు. ఆమెతో అతడికి నిశ్చితార్థం కూడా కుదురుతుంది. కానీ ఇంతలో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అధికారులు మంజునాథ్ ను వెంటాడి కాలుస్తారు. తర్వాత అతణ్ని తమ కస్టడీలోకి తీసుకుంటారు. దీని వెనుక ఉన్నది మైకేల్ అని తర్వాత తెలుస్తుంది. ఇంతకీ ఈ మైకేల్ ఎవరు.. తన నేపథ్యమేంటి.. అత్యంత ప్రమాదకరమైన అతడి నుంచి సిద్దార్థ్-మంజు ఎలా తప్పించుకున్నారు అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ:

హీరోగా.. నటుడిగా తనకు పరిమితులు ఉన్నప్పటికీ.. సక్సెస్ రేట్ కూడా తక్కువైనప్పటికీ.. కథల ఎంపికలో తనకున్న అభిరుచి.. సినిమా కోసం తను పడే కష్టం వల్ల ప్రేక్షకుల్లో ఒక సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. 'బింబిసార' లాంటి ఫాంటసీ టచ్ ఉన్న కథతో గత ఏడాది పెద్ద సక్సెస్ అందుకున్నాక అతను.. 'అమిగోస్' కోసం ఈసారి పూర్తిగా రూటు మార్చేశాడు. ''మనిషిని పోలిన మనుషులు ముగ్గురు ఒక చోట చేరితే..'' అనే హాలీవుడ్ సినిమాలను గుర్తు చేసే పాయింట్ మీద కొత్త దర్శకుడైన రాజేందర్ రెడ్డిని నమ్మి కళ్యాణ్ రామ్ సినిమా చేశాడు. ఈ పాయింట్ వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా అనిపించేదే. కానీ ఇలాంటి పాయింట్లను తెర మీద ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడం.. రెండు గంటలకు పైగా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం అంత తేలికైన విషయం కాదు. ప్లాట్ పాయింట్ వరకే కాకుండా సినిమా అంతగా కొత్తగా అనిపించేలా చేస్తే.. ఉత్కంఠ రేకెత్తిస్తేనే మంచి ఫలితం ఉంటుంది. కానీ ఈ విషయంలో 'అమిగోస్' నిరాశపరుస్తుంది. నెగెటివ్ షేడ్స్ తో సాగే ఒక పాత్ర మీద మాత్రమే ఫోకస్ పెట్టడం.. మిగతా పాత్రలను తేల్చేయడం.. కథనంలో కొత్తదనం లేకపోవడం దీనికి మైనస్ అయ్యాయి. ప్రయోగం వికటించేలా.. విసిగించేలా సినిమా లేదు కానీ.. అదే సమయంలో 'వావ్' అనిపించేలా కూడా లేదు.

'అమిగోస్'లో కథేంటన్నది ట్రైలర్ చూస్తేనే అర్థం అయిపోయింది. ఒకే పోలికలతో ఉండే ముగ్గురు అనుకోకుండా కలవడం.. అందులో ఒక పాత్రకు నెగెటివ్ షేడ్స్ ఉండి మిగతా ఇద్దరినీ తిప్పలు పెట్టడం.. ఈ నేపథ్యంలో కథ సాగుతుందని ట్రైలర్ చూస్తేనే తెలిసిపోయింది. ఇలా కథేంటో తెలుసుకుని థియేటర్లోకి అడుగు పెట్టాక ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం సవాలే. ఆరంభ సన్నివేశాలతో 'అమిగోస్' కొంత మేర సంతృప్తిపరుస్తుంది. కానీ ఒకే పోలికలున్న ముగ్గురు ఒక చోటికి చేరాక మాత్రం సినిమా రొటీన్ రూట్లోకి వచ్చేస్తుంది. కథానాయికతో హీరో ప్రేమలో పడడం.. అతడికి మిగతా ఇద్దరు సాయం చేయడం.. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఒక మామూలు సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఇంటర్వెల్ దగ్గర కానీ మళ్లీ 'అమిగోస్' ట్రాక్ ఎక్కదు. అక్కడ వచ్చే మలుపుతో మళ్లీ ఆసక్తి మొదలవుతుంది.

ఇక ద్వితీయార్ధంలో మైకేల్ పాత్రకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ లో కళ్యాణ్ రామ్ లుక్ అదీ చూసి ఎగ్జైట్ అవుతాం కానీ.. ఆ లుక్ ఉన్నంత కొత్తగా తన పాత్ర లేకపోయింది. అతను రూత్ లెస్ అనిపించేలా కొన్ని సన్నివేశాలు పెట్టారు కానీ.. ఇలాంటి పాత్రల్ని తెరపై చూస్తున్నపుడు కలగాల్సిన భయం.. ఉత్కంఠ మాత్రం కలగవు. వర్తమానంలోకి వచ్చాక సన్నివేశాలు బోరింగ్ అయితే అనిపించవు కానీ.. ప్రేక్షకులను ఆశ్చర్యానికి కూడా గురి చేయవు. విలన్-హీరో మధ్య ఎత్తులు పై ఎత్తులతో కథనం ఓ మోస్తరుగా సాగిపోతుంది. ప్రేక్షకుల దృష్టి ఎంతసేపూ నెగెటివ్ క్యారెక్టర్ మీదే ఉంటుంది తప్ప.. వారి దృష్టిని ఆకర్షించేలా మిగతా పాత్రలేవీ లేకపోవడం మైనస్. సినిమా నడిచిపోతోందంటే నడిచిపోతోంది అనిపిస్తుందే తప్ప ప్రేక్షకులకు 'హై' ఇచ్చే ఎపిసోడ్ ఒక్కటీ లేదు సినిమాలో. ముగింపులో సైతం మెరుపులు లేకపోవడంతో ఒక సాధారణ సినిమాలాగే 'అమిగోస్' ముగుస్తుంది. సినిమా కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నపుడు కలిగిన ఎగ్జైట్మెంట్.. సినిమా చూస్తున్నపుడు.. చూశాక కలగదు.


నటీనటులు:

కళ్యాణ్ రామ్ మూడు పాత్రలు చేయడానికి కొంచెం కష్టపడ్డాడు. ఆటోమేటిగ్గా సినిమాలో అందరి దృష్టీ నెగెటెవ్ షేడ్స్ ఉన్న మైకేల్ పాత్ర మీదే నిలుస్తుంది. క్యారెక్టరైజేషన్ పరంగా ప్రత్యేకత ఉన్నది దానికే. ఆ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో కళ్యాణ్ రామ్ లుక్.. హావభావాలు ఆకట్టుకుంటాయి. కాస్త భిన్నమైన డైలాగ్ మాడ్యులేషన్ తోనూ ఈ పాత్రకు ప్రత్యేకత చేకూర్చడానికి కళ్యాణ్ రామ్ ప్రయత్నించాడు. మిగతా రెండు పాత్రలో ఏమంత విశేషం లేదు. కళ్యాణ్ రామ్ వాటిలో సాధారణంగానే కనిపించాడు. హీరోయిన్ ఆషికా రంగనాథ్ పర్వాలేదు. ఆమె బబ్లీగా కనిపించింది. గ్లామర్.. నటన పరంగా స్పెషల్ గా ఏమీ అనిపించదు. హీరో పక్కనే ఉండే పాత్రలో బ్రహ్మాజీ బాగానే చేశాడు. సప్తగిరి కాసేపు మెరిసి మాయమయ్యాడు. హీరో తల్లిదండ్రుల పాత్రల్లో తమిళ ఆర్టిస్టులు జయప్రకాష్-కళ్యాణ్ నటరాజన్ ఓకే.


సాంకేతిక వర్గం:

'అమిగోస్' సాంకేతికంగా ఉండాల్సినంత స్థాయిలో లేదు. థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్టు అయిన జిబ్రాన్.. నేపథ్య సంగీతం విషయంలో నిరాశ పరిచాడు. బిపిన్ పాత్రకు సంబంధించి ప్రేక్షకులను వెంటాడే థీమ్ మ్యూజిక్ ఇచ్చే అవకాశమున్నా అతను ఉపయోగించుకోలేపోయాడు. ఆర్ఆర్ చాలా చోట్ల లౌడ్ గా అనిపిస్తుంది కానీ.. అది బలమైన ముద్ర మాత్రం వేయలేకపోయింది. పాటల్లో 'ఎన్నో రాత్రులొస్తాయి' బాగున్నప్పటికీ అది రీమిక్స్. ఇంకో పాట ఏమంత ఆకట్టుకోదు. మొత్తంగా జిబ్రాన్ నిరాశపరిచాడు. సౌందర్ రాజన్ ఛాయాగ్రహణం మామూలుగా సాగిపోయింది. థ్రిల్లర్ సినిమాల్లో ఒక మూడ్ క్రియేట్ చేసేలా కెమెరా పనితనం ఉండాలి. ఇందులో అది మిస్సయింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఓకే. కొత్త దర్శకుడు రాజేందర్ రెడ్డి ఎంచుకున్న పాయింట్ భిన్నమైందే. కానీ దాన్ని తెరపై ప్రెజెంట్ చేయడంలో అంత కొత్తదనం కనిపించలేదు. స్క్రీన్ ప్లేలో ఉత్కంఠ లోపించింది. కొన్ని సన్నివేశాల వరకు బాగానే డీల్ చేసినా.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా దర్శకుడు పెద్దగా ఏమీ చేయలేదు.

చివరగా: అమిగోస్.. నో హైస్.. కాస్త టైంపాస్

రేటింగ్-2.5