Begin typing your search above and press return to search.

అమిగోస్ ఫస్ట్ లుక్: సిద్ధార్థ అభిమ‌న్యుని త‌ల‌పిస్తున్నాడు!

By:  Tupaki Desk   |   2 Jan 2023 4:30 AM GMT
అమిగోస్ ఫస్ట్ లుక్:  సిద్ధార్థ అభిమ‌న్యుని త‌ల‌పిస్తున్నాడు!
X
'బింబిసార' లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత కళ్యాణ్ రామ్ ఆచితూచి ఎంపిక‌ల‌తో ముందుకు వెళుతున్నాడు. స్క్రిప్టు ప‌రంగా ఎక్క‌డా రాజీకి రాకుండా సెల‌క్టివ్ గా ఉంటున్నార‌ని తెలిసింది. ఆయ‌న‌ తన తదుపరి చిత్రం 'అమిగోస్' కోసం నూతన దర్శకుడు రాజేంద్ర రెడ్డితో కలిసి పని చేస్తున్నాడు.

తాజాగా టైటిల్ పోస్ట‌ర్ ని మేక‌ర్స్ కొత్త సంవ‌త్స‌ర కానుక‌గా విడుద‌ల చేశారు. 10 ఫిబ్రవరి 2023న విడుదలవుతున్న ఈ చిత్రం నుండి క్యారెక్టర్ పోస్టర్ ల‌ను రిలీజ్ చేయ‌డం ద్వారా ప్ర‌చారానికి సిద్ధ‌మ‌య్యామ‌ని హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ కథానాయికగా నటిస్తోంది.

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా రిలీజ్ చేసిన అధికారిక పోస్ట‌ర్ లో క‌ళ్యాణ్ రామ్ లుక్ అద్భుతం. ఈసారి అత‌డు ఎంచుకున్న పాత్ర చాలా ట్రిక్కీగా ఉంటుంద‌ని అర్థ‌మవుతోంది. అత‌డు కంపెనీ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ గా కళ్యాణ్ రామ్ పోస్టర్ లో స్టైలిష్ గా కనిపించాడు. ముఖ్యంగా ఈ పాత్ర కోసం అత‌డి మేకోవ‌ర్ స్ట‌న్నింగ్ అని చెప్పాలి.

అయితే ఈ లుక్ చూడ‌గానే ధృవ సినిమాలో అర‌వింద స్వామిలా క‌నిపించాడ‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. యాధృచ్ఛికంగా ధృవ‌లో అర‌వింద స్వామి పాత్ర పేరు కూడా సిద్ధార్థ.. త‌మిళ మాతృక‌ త‌నిఒరువ‌న్ లో అసాధార‌ణ మేధావిగా క‌నిపించిన అర‌వింద స్వామి.. ధృవ‌లోను అంతే అద్భుతంగా క‌నిపించారు. కంపెనీల సృష్టిక‌ర్త‌గా కాన్ మాన్ గా అత‌డు అద్భుత న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ పాత్ర‌ను ఆ రేంజులో ఊహిస్తున్నారు.

త్వరలో విడుదల కానున్న మరో రెండు లుక్స్ పైనా నంద‌మూరి అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర పనులు సాగుతున్నాయి. త్వ‌ర‌లోనే టీజ‌ర్- ట్రైల‌ర్ తో అద‌ర‌గొట్ట‌నున్నార‌ని కూడా హింట్ అందింది.

వరుస సినిమాల‌తో జోరుమీదున్న మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ఎస్ సౌందరరాజన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్ గా కొన‌సాగ‌నున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.