Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: అమీ తుమీ

By:  Tupaki Desk   |   9 Jun 2017 10:26 AM GMT
మూవీ రివ్యూ: అమీ తుమీ
X
చిత్రం: ‘అమీ తుమీ’

నటీనటులు: అడివి శేష్ - అవసరాల శ్రీనివాస్ - వెన్నెల కిషోర్ - ఈషా - అదితి - తనికెళ్ల భరణి - మంజుల తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: పి.జి.విందా
నిర్మాత: కె.ఎల్.నరసింహారావు
కథ - స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి

తెలుగులో తెలుగుదనం ఉట్టిపడేలా సినిమాలు తీసే దర్శకుల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి ఒకరు. ‘అష్టాచెమ్మా’.. ‘గోల్కొండ హైస్కూల్’.. ‘అంతకుముందు ఆ తరువాత’.. ‘జెంటిల్మన్’ లాంటి సినిమాలతో మెప్పించిన మోహనకృష్ణ.. ఇప్పుడు ‘అమీతుమీ’ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘అష్టాచెమ్మా’ తరహా నేటివ్ కామెడీలా కనిపించిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

దీపిక (ఈషా) ఓ కోటీశ్వరుడి కూతురు. ఆమె అనంత్ (అడివి శేష్) అనే కుర్రాడిని ప్రేమిస్తుంది. ఐతే ఆమె తండ్రి మాత్రం తనకు శ్రీ చిలిపి (వెన్నెల కిషోర్) అనే డబ్బున్న వాడితో పెళ్లి చేయాలనుకుంటాడు. మరోవైపు దీపిక అన్నయ్య విజయ్ (అవసరాల శ్రీనివాస్).. మాయ (అదితి) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇది కూడా అతడి తండ్రికి నచ్చదు. మరి దీపిక.. విజయ్.. తమ తండ్రిని మాయ చేసి తాము ప్రేమించిన వాళ్లను పెళ్లి చేసుకోవడానికి ఏం చేశారు.. ఈ క్రమం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

టీవీల్లో కామెడీ షోలు హోరెత్తించేస్తున్న ఈ రోజుల్లో సినిమాల్లో మామూలు కామెడీతో నెట్టుకురావడం అంటే కష్టమే. ఇలాంటి సమయంలో ఇంద్రగంటి మోహనకృష్ణ క్లీన్ కామెడీ అంటూ ‘అష్టాచెమ్మా’తో వచ్చాడు. ఐతే ఇంద్రగంటి అన్నట్లుగా ‘అమీతుమీ’.. ‘అష్టాచెమ్మా’ స్థాయిలో అయితే వినోదాన్ని పంచలేకపోయింది. ఇందులో ‘సినిమా’ స్థాయి వినోదం లేదు. వెండి తెర మీద ‘వెబ్ సిరీస్’ చూస్తున్నట్లుగా అనిపిస్తుంది ‘అమీతుమీ’ చూస్తుంటే. మల్టీప్లెక్స్ ఆడియన్స్ మెచ్చే సిచువేషనల్ కామెడీతో సోసోగా బండి లాగించేశాడు ఇంద్రగంటి.

వెన్నెల కిషోర్ పాత్ర.. అతడి హావభావాలు.. కామెడీ టైమింగ్ వల్ల అతడితో ముడిపడ్డ సన్నివేశాలు ఎంటర్టైన్ చేసినప్పటికీ.. ఓవరాల్ గా ‘అమీతుమీ’ హిలేరియస్ అనిపించేట్లయితే లేదు. అంచనాలేమీ పెట్టుకోకుండా చూస్తే ‘అమీతుమీ’ రెండు గంటల పాటు ఓ మోస్తరుగా టైంపాస్ చేయిస్తుంది కానీ.. ప్రత్యేకమైన ముద్ర అయితే వేయదు. చాలా మామూలు పాత్రలకు కూడా తన కామెడీ టైమింగ్ తో ప్రత్యేకత తీసుకురాగల నటుడు వెన్నెల కిషోర్. అతడికి మంచి కామెడీ రోల్ ఇచ్చాడు ఇంద్రగంటి. తన పాత్రకు న్యాయం చేస్తూ కిషోర్ బాగానే ఎంటర్టైన్ చేశాడు. ఐతే వెన్నెల కిషోర్ ను తీసేసి చూస్తే ‘అమీతుమీ’ చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. తెరమీద వెన్నెల కిషోర్ కనిపించినంతసేపూ ‘అమీతుమీ’ ఓ మోస్తరుగా ఎంగేజ్ చేస్తుంది కానీ.. అంతకుమించి సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు.

కొంచెం నెమ్మదిగా.. సాదాసీదాగా మొదలయ్యే ‘అమీతుమీ’కి వేగం తీసుకొచ్చేది.. ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తూ వాళ్లను నవ్వించే బాధ్యత తీసుకునేది కిషోరే. ఇంద్రగంటి అతడి పాత్రకు రాసిన డైలాగులు కూడా బాగానే పేలడంతో కిషోర్ పాత్ర ప్రవేశించిన దగ్గర్నుంచి ‘అమీ తుమీ’ జోరందుకుంటుంది. కథగా చెప్పుకోవడానికి ‘అమీతుమీ’లో ఏం లేదు. తమ పెళ్లిళ్లకు అడ్డం పడుతున్న తండ్రిని మస్కా కొట్టి తాము కోరుకున్న వాళ్లను పెళ్లాడేందుకు ప్రయత్నించే కూతురు-కొడుకు కథ ఇది. ఈ మస్కా కొట్టే క్రమంలో పేర్లు.. ఐడెంటిటీలు మారిపోతాయి. ఆ వ్యవహారం కొంచెం సిల్లీగా.. ఇల్లాజికల్ గా సాగినప్పటికీ.. కొంచెం పెద్దమనసు చేసుకుని సర్దుకుపోవాలి. వెన్నెల కిషోర్ పోషించిన ‘శ్రీ చిలిపి’ పాత్ర.. సినిమాలోని లోపాల్ని ప్రేక్షకులు కొంత మేర మన్నించేలా చేస్తుంది. ఆ పాత్రతో కనెక్టయితే సినిమా ఓకే అనిపిస్తుంది.

ఇంద్రగంటి ‘అష్టాచెమ్మా’ తర్వాత మరోసారి రచయితగా తన పని తనం చూపిస్తూ.. కొన్ని చోట్ల సిచువేషనల్ కామెడీని బాగానే పండించాడు ‘అమీతుమీ’లో. ‘‘అమ్మ స్వర్గానికెళ్లి ఉంటుందా.. డౌటే’’ అని చెల్లెలంటే.. ‘‘నాన్నతో ఉన్నది నరకంలోనే కాబట్టి కచ్చితంగా స్వర్గానికే వెళ్లుంటుందే’’ అంటాడు అన్నయ్య. ఇలాంటి ఫన్నీ డైలాగ్స్ కొన్ని బాగానే పేలాయి. రచయితగా.. దర్శకుడిగా ఇంద్రగంటి వీక్ అయిన చోట నటీనటులు అందుకుని కవర్ చేశారు. రెండు గంటల్లోపు నిడివి ఉన్న ‘అమీతుమీ’లో ఆరంభంలో.. మధ్యలో అక్కడక్కడా బోర్ కొడుతుంది. ఐతే చాలా వరకు రెండు మూడు లొకేషన్లలోనే కథ సాగిపోవడం.. నిడివి తక్కువ కావడం వల్ల ‘అమీతుమీ’ ఒక సినిమాలా కాకుండా వెబ్ సిరీస్ చూసిన ఫీలింగ్ కలిగిస్తుంది. ఇక ఇంద్రగంటి మార్కు క్లాస్ కామెడీ.. ఇందులోని డైలాగులు మాస్ ప్రేక్షకులకు ఏమేరకు కనెక్టవుతాయన్నది సందేహం. ఇందులో కమర్షియల్ ఎలిమెంట్లు తక్కువ.

నటీనటులు:

ముందే అన్నట్లు ఈ సినిమాకు రియల్ హీరో వెన్నెల కిషోరే. శ్రీ చిలిపి అనే అతడి పేరు ఎంత ఫన్నీగా ఉంటుందో.. అతడి పాత్ర కూడా అంతే సరదాగా ఉంటుంది. ప్రేక్షకుల్ని ఆద్యంతం నవ్విస్తూ మొత్తం సినిమాను తన భుజాల మీద నడిపించాడు కిషోర్. అవసరాల శ్రీనివాస్ సినిమాలో చాలా తక్కువ సమయం కనిపిస్తాడు. కానీ కనిపించినపుడల్లా తన ప్రత్యేకత చాటుకుంటాడు. కిషోర్ కాంబినేషన్లో అతడి సీన్లు బాగా పండాయి. అడివి శేష్ పాత్రకు తగ్గట్లు నటించాడు. తనికెళ్ల భరణికి మరోసారి ఇంద్రగంటి మంచి పాత్ర ఇచ్చాడు. ఆయన కూడా మెప్పించారు. హీరోయిన్ ఈషా సహజంగా నటించింది. అదితికి పెద్దగా స్కోప్ లేదు. జస్ట్ ఓకే అనిపిస్తుంది. హీరోయిన్ల కంటే కూడా పనిమనిషి పాత్రలో మంజుల ఎక్కువ స్కోర్ చేసింది. కొన్ని చోట్ల ఓవరాక్షన్ చేసినట్లు అనిపించినా.. ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. వెన్నెల కిషోర్ అసిస్టెంట్ పాత్రలో కనిపించిన నటుడు కూడా బాగా చేశాడు.

సాంకేతికవర్గం:

దర్శకుల టేస్టుకు తగ్గట్లు పని చేసే మణిశర్మ.. ‘అమీతుమీ’లో ఇంద్రగంటి అభిరుచికి తగ్గ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు కానీ.. సందర్భానుసారం వచ్చే రెండు పాటలూ ఓకే అనిపిస్తాయి. వాటి చిత్రీకరణ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కొంచెం భిన్నంగా అనిపిస్తుంది. మణి. పి.జి.విందా ఛాయాగ్రహణం ఓకే. బడ్జెట్ పరిమితుల నేపథ్యంలో కథ చాలా వరకు రెండు మూడు లొకేషన్లలోనే సాగినప్పటికీ మొనాటనీ రాకుండా కెమెరాతో కవర్ చేశాడు. నిర్మాణ విలువలు చాలా మామూలుగా అనిపిస్తాయి. చాలా తక్కువ ఖర్చుతో సినిమాను లాగించేసిన సంగతి స్పష్టంగా తెలుస్తుంది. ఇంద్రగంటి ఉద్దేశపూర్వకంగానే ఇలా తక్కువ ఖర్చుతో ఓ ప్రయోగాత్మక సినిమా తీయాలనే ప్రయత్నంలో ‘అమీతుమీ’ చేశాడేమో అనిపిస్తుంది. ఇంద్రగంటి కథాకథనాలు చాలా మామూలుగా అనిపిస్తాయి. డైలాగుల విషయంలో మాత్రం ఆయన ముద్ర కనిపిస్తుంది.

చివరగా: అమీతుమీ.. వెన్నెల కిషోర్ నవ్వించాడు కానీ..!!

రేటింగ్- 2.5/5

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre