Begin typing your search above and press return to search.

అమెరికన్స్‌ సైతం బ్రహ్మీకి క్లీన్‌బౌల్డ్‌

By:  Tupaki Desk   |   18 March 2015 3:00 PM IST
అమెరికన్స్‌ సైతం బ్రహ్మీకి క్లీన్‌బౌల్డ్‌
X
1000 సినిమాల రారాజు బ్రహ్మీ అలియాస్‌ బ్రహ్మానందం. తెలుగు ప్రేక్షకుల్ని రెండున్నర దశాబ్ధాలుగా నవ్విస్తూనే ఉన్నాడు. అయినా అతడి దాహం తీరనిది. ఇప్పటికీ యువతరం కమెడియన్లతో పోటీపడుతూ అదే ఎనర్జీని ప్రదర్శిస్తున్నాడు. డబ్బు, దస్కం మాటేమో గానీ బ్రహ్మీ పేరిట తిరగరాయలేని రికార్డులు చేరుతున్నాయి.

ప్రపంచంలోనే 1000 సినిమాల్లో నటించిన కమెడియన్‌ వేరే ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. హాలీవుడ్‌, బాలీవుడ్‌ సైతం బ్రహ్మీ ముందు మోకరిల్లాల్సిందే. అంతటి ఘనకీర్తి సినీయవనికపై ఆర్జించాడు. అతడి ఖ్యాతి ఎంతగా విస్తరించింది అంటే సాక్షాత్తూ ఓ అమెరికన్‌ బ్రహ్మీని చూసి నేను మీకు వీరాభిమానిని అంటూ సంబరపడిపోయాడు. అమెరికన్‌ కాన్సులేట్‌లో వీసా కోసం వెళ్లిన బ్రహ్మీని చూసి ఓ అమెరికన్‌ అధికారి.. ఏమన్నాడంటే... నేను అధికారిగా ఇండియా వచ్చినప్పుడు చూసిన మొట్టమొదటి కమెడియన్‌ బ్రహ్మానందం. అతడి సినిమా చూశా. అద్భుతమైన హాస్యనటుడు. తర్వాత సునీల్‌ కామెడీ అన్నా ఇష్టమే.. అంటూ చెప్పుకొచ్చాడు.

తన చెంత ఉన్న ఓ ట్రాన్స్‌లేటర్‌తో ఈ మాట చెప్పించాడు అతడు. ఇంతకంటే ఓ నటుడికి ఏం కావాలి. ఇది అరుదైన గౌరవం. ఎదురూ చూడని సందర్భం. బ్రహ్మీ కళ్లలో ఆనందభాష్పాలు ఆ క్షణంలో జాలువారాయి. అన్నట్టు త్వరలోనే బ్రహ్మానందం ఆటోబయోగ్రఫీ పుస్తకరూపంలో వెలువడనుంది. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడు అతడు.