Begin typing your search above and press return to search.

బిగ్ బాంబ్: టాలీవుడ్ అమెజాన్ గుప్పిట్లోకి?

By:  Tupaki Desk   |   12 May 2020 11:45 AM IST
బిగ్ బాంబ్: టాలీవుడ్ అమెజాన్ గుప్పిట్లోకి?
X
టాలీవుడ్ అమెజాన్ గుప్పిట్లోకి వెళ్లిపోనుందా? ఇక్క‌డ ఉన్న బ‌డా నిర్మాత‌లంతా అమెజాన్ చెర‌లో ఇరుక్కోనున్నారా? అంటే అవున‌నే సందేహం క‌లుగుతోంది. అదెట్టాగా..? అంటే.. కాస్త లోతుగా వివ‌రాల్లోకి వెళ్లాలి. క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా ఇప్ప‌టికే అమెరికా అల్ల‌క‌ల్లోలంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు 70 వేల మ‌ర‌ణాల‌తో అమెరికా ప్ర‌పంచ‌ దేశాల్లోనే నంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. ల‌క్ష‌లాది మందికి క‌రోనా చికిత్స సాగుతూనే ఉంది. వేలాది మంది అక్క‌డ ఆస్ప‌త్రుల్లో జాయిన్ అవుతూనే ఉన్నారు. ఓవైపు ట్రంప్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్ని గాడిన పెట్టేందుకు ఎన్ని చేస్తున్నా ఫ‌లితం రావ‌డం లేదు. ఇలాంటి స‌న్నివేశంలో అమెరికాలోనే అతి పెద్ద థియేట‌ర్ చైన్ గా చెప్పుకునే ఏఎంసీ థియేట‌ర్ల‌ను ష‌ట్ డౌన్ చేయ‌డం ఇక అది ఎప్ప‌టికీ తెరుచుకునేందుకు ఆస్కారం లేద‌ని ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు రావ‌డం వేడెక్కించింది.

ఇప్ప‌టికే అమెరికా ఏఎంసీ కంపెనీ దివాళా దిశ‌గా వెళుతోంది. ఇక తిరిగి థియేట‌ర్ల‌ను తెరిచే ఆలోచ‌న‌లో లేనేలేద‌ని ప్ర‌చార‌మైపోయింది. దీంతో ఏఎంసీ స్టాక్స్ కూడా నిలువునా కుప్ప‌కూలాయి. లాక్ డౌన్ లో ఏఎంసీ థియేట‌ర్లు అన్నీ మూసివేయ‌డంతో త‌లెత్తిన ప‌రిణామ‌మిది. అయితే ఇదే అద‌నుగా కాపు కాసుకుని కూచున్న డిజిటల్ & రిటైల్ దిగ్గజం అమెజాన్ ఏఎంసీ థియేటర్లను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఏఎంసీ స్టాక్ ధరలు నిన్న 26 శాతం కన్నా ఎక్కువ పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం తర్వాత స్టాక్స్ 70 శాతం క్షీణించాయి. ఏఎంసీ ఉత్తర అమెరికా- కెనడా - బ్రిట‌న్ లో అతిపెద్ద థియేటర్ చైన్. అయితే అమెరికా వ‌ర‌కూ అమెజాన్ కి విక్ర‌యించే యోచ‌న చేస్తోంద‌ట‌. ఇలా ఏఎంసీని ఒక దేశంలో చేజిక్కించుకుని అటుపై మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ బిజినెస్ లోనూ స‌త్తా చాటాల‌న్న యోచ‌న‌తో అమెజాన్ ఉందిట‌.

అమెజాన్ స్టూడియోస్ ఒరిజినల్ ఫిల్మ్స్ స‌హా టెలివిజన్ షోలను నిర్మిస్తోంది. ఇప్పుడు ఏఎంసీని స్వాధీనం చేసుకుంటే అది తెలివైన ఒప్పందం అవుతుంది. అటుపై వ్యాపారం ప‌దింత‌లు పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తోంది. అయితే ఇన్నాళ్లు అమెరికాలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న తెలుగు సినిమాల్ని ఇక‌పై అమెజాన్ వాళ్ల‌కే క‌ట్ట‌బెట్టాల్సి ఉంటుంది. బాహుబ‌లి త‌ర్వాత అక్క‌డ బిజినెస్ రేంజు పెరిగింది. ఇటీవ‌ల పెద్ద రేంజు బిజినెస్ సాగింది. బ‌డా సినిమాల విష‌యంలో బ‌డా నిర్మాత‌లు పెద్ద రేట్ చెబుతూ బాగానే బిజినెస్ సాగించారు. ఇక‌పై ఏఎంసీకి సంబంధించిన‌ ఏ విష‌య‌మైనా.. అమెజాన్ ప్ర‌తినిధుల‌తోనే మాట్లాడాలి. అలా ఓవ‌ర్సీస్ బిజినెస్ బేరం అమెజాన్ వాళ్ల‌తోనే ముడిప‌డిందన్న‌మాట‌. ఇప్ప‌టికే టాలీవుడ్ క్రేజీ సినిమాల డిజిట‌ల్ రైట్స్ ని చేజిక్కించుకుంటూ బిజినెస్ అంతా త‌న గుప్ప‌టి ప‌ట్టేస్తోంద‌న్న విమ‌ర్శ అమెజాన్ పై ఉంది. మ‌రి తాజా ప‌రిణామం చూస్తుంటే మొత్తం వినోద పరిశ్ర‌మ‌నే అమెజాన్ క‌బ‌లించేస్తుందా? అన్న సందేహం క‌లుగుతోంది.