Begin typing your search above and press return to search.

జాను మాదిరే లూసిఫర్ దెబ్బేస్తుందేమో చూసుకో చిరు

By:  Tupaki Desk   |   14 Feb 2020 3:30 AM GMT
జాను మాదిరే లూసిఫర్ దెబ్బేస్తుందేమో చూసుకో చిరు
X
సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి పాజిటివ్ బజ్ తో పాటు.. విడుదల వేళలోనూ భారీ అంచనాల్ని సెట్ చేసిన మూవీ జాను. కానీ.. రిలీజ్ అయ్యాక వచ్చిన ఫలితం దిమ్మ తిరిగేలా చేసింది. చివరకు స్టార్ నిర్మాత దిల్ రాజు సైతం.. తాను జాను మూవీని లెక్కలు వేసుకొని తీయలేదంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మరో రోజులో వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ విడుదల అవుతున్న వేళ.. థియేటర్లలో జానును తీసేయటం ఖాయం. అంటే.. ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అన్నట్లే. ఇలాంటి పరిస్థితి ఎందుకన్నప్పుడు.. కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లు జానుకు వర్తిస్తుందని చెప్పాలి.

జాను తమిళం 96 రీమేక్ అన్న ప్రచారంతో పాటు.. ఆన్ లైన్ లో ఈ సినిమా అందుబాటులో ఉండటం.. అమెజాన్ లోనూ ఉండటంతో.. ఈ సినిమాను తమిళ్ వెర్షన్ లోనే పిచ్చి పిచ్చిగా చూసేశారు. చూసిన సినిమాను మళ్లీ పెద్ద తెర మీద డబ్బులు పెట్టి చూడటం ఇబ్బందే. అందుకే.. ఒరిజినల్ చూశాం కదా? అందులో త్రిషకు బదులు సమంతను ఊహించుకుంటే సరిపోతుందని సరిపెట్టుకున్నోళ్లు తక్కువేం కాదంటున్నారు.

ఇదిలా ఉంటే.. చిరు నటిస్తారని చెబుతున్న లూసిఫర్ పరిస్థితి కూడా ఇలానే ఉంటుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. 96 తెలుగులో డబ్ చేయలేదు. కానీ.. మలయాళం మూవీ లూసిఫర్ ను అదే పేరుతో తెలుగులో డబ్ చేసి వదిలారు. మోహన్ లాల్ నటించిన ఈ మూవీ తెలుగులో ఆడలేదు. ఎప్పుడు విడుదలైందో.. ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా తెలీదు. మాలీవుడ్ లో మాత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. ఇలాంటి వేళ.. ఈ సినిమాను రీమేక్ చేయటం తప్పేం కాదు. కానీ.. సమస్య ఏమిటంటే.. లూసిఫర్ తెలుగు వెర్షన్ అమెజాన్ లో ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. సెర్చ్ లోకి వెళ్లి చూస్తే చాలు.. ఈ సినిమా వచ్చేస్తుంది.

అలాంటి అవకాశం ఉన్నప్పుడు.. ఎన్ని మార్పులు చేస్తే మాత్రం.. మూలకథలో మార్పు అయితే ఉండదు కదా? చిరునటిస్తున్న రీమేక్ అన్నంతనే అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. ఆ సినిమా ఎలా ఉంటుందో చూద్దామని చూడటం ఖాయం. అదే జరిగితే.. లూసిపర్ రీమేక్ పూర్తి అయ్యే నాటికి అమెజాన్ లో భారీగా చూసేయటం గ్యారెంటీ. ఇవాల్టి రోజున చూసిన సినిమాను మళ్లీ చూసే ఓపిక లేదు. అదే జరిగితే లూసిఫర్ కు జాను విషయంలో ఏం జరిగిందో అదే అనుభవం రిపీట్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. అలానే జరిగితే నష్టం భారీగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ఈ ప్రమాదాన్ని చిరు గుర్తించారా? అన్నదే ప్రశ్న.