Begin typing your search above and press return to search.

'గ్యాంగ్ లీడర్' ను ప్రైమ్‌ లో పెట్టి తీసేశారే..

By:  Tupaki Desk   |   11 Oct 2019 9:38 AM GMT
గ్యాంగ్ లీడర్ ను ప్రైమ్‌ లో పెట్టి తీసేశారే..
X
ఇది ఇంతకుముందెన్నడూ చూడని చిత్రమే. ఒక సినిమాను అమేజాన్ ప్రైమ్‌ లో పెట్టడం.. కొన్ని గంటల్లో తీసేయడం ఆశ్చర్యకరమే. నిన్న రాత్రి ఈ చిత్రం చోటు చేసుకుంది. నాని హీరోగా విక్రమ్ కె.కుమార్ రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఐతే వీకెండ్ లో ఊపు చూపించిన ఈ చిత్రం తర్వాత నిలబడలేదు. చివరికి ఎబోవ్ యావరేజ్ రిజల్ట్ తెచ్చుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ అమేజాన్ వాళ్లతో ఏం అగ్రిమెంట్ చేసుకుందో ఏమో కానీ.. విడుదలైన 28వ రోజుకే ఈ చిత్రం అమేజాన్‌ లోకి వచ్చేసింది. ఐతే మరీ రిలీజైన నెల రోజుల్లోపే ఇలా డిజిటల్ ఫ్లాట్ ఫాంలోకి వచ్చేస్తే ఇక జనాలు థియేటర్లకు ఏం వస్తారంటూ నాని అభిమానులే కాదు.. సగటు సినీ ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైమ్ వాళ్లను - నిర్మాతల్ని తిట్టిపోయడం మొదలుపెట్టారు.

మరి సోషల్ మీడియాలో ఈ వ్యతిరేకత చూసి కంగారు పడ్డారో ఇంకేదైనా కారణం ఉందో కానీ.. ప్రైమ్‌ నుంచి కొన్ని గంటల్లోనే ‘గ్యాంగ్ లీడర్’ను తీసేశారు. కానీ ఆ లోపు పెద్ద నష్టం జరిగిపోయింది. ఒక పైరసీ వెబ్ సైట్ 4కే రెజొల్యూషన్‌ తో సినిమాను పైరసీ చేసి తన వెబ్ సైట్ లో పెట్టేసింది. దీంతో నాని ఫ్యాన్స్ మరింతగా ఫైర్ అయ్యారు. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో ‘గ్యాంగ్ లీడర్’ మళ్లీ ప్రైమ్‌ లోకి ఎప్పుడొస్తుందో చూడాలి. పోస్టర్ల మీద అమేజాన్ ప్రైమ్ బొమ్మ వేసి మరీ ప్రమోట్ చేస్తుండటంతోో సినిమాల వసూళ్లపై ప్రతికూల ప్రభావం పడుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. నెల రోజులు ఆగితే సినిమా ఆన్ లైన్లో ఫ్రీగా చూసుకోవచ్చన్న ఆలోచనతో వీకెండ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేస్తున్న మాట వాస్తవం. ఆన్ లైన్ రిలీజ్‌ కు కనీసం రెండు నెలలైనా విరామం ఉండాలన్న సూచనల్ని నిర్మాతలు పట్టించుకోవట్లేదు. కానీ అంతిమంగా వాళ్లే నష్టపోతున్నారు.