Begin typing your search above and press return to search.

అమ్మో తెలుగు సినిమా.. అమేజాన్ భయం!

By:  Tupaki Desk   |   5 Oct 2020 7:30 AM GMT
అమ్మో తెలుగు సినిమా.. అమేజాన్ భయం!
X
తెలుగు సినిమాల బడ్జెట్లు, మార్కెట్ విస్తరించడానికి పరోక్షంగా పెద్ద సాయమే చేసింది అమేజాన్ ప్రైమ్. కొత్త సినిమాలు విడుదలై ఒకట్రెండు నెలలకు డిజిటల్ స్ట్రీమింగ్ చేసే కల్చర్ మొదలయ్యాక అందులో చాలా దూకుడుగా వ్యవహరించింది ఈ ఓటీటీ ప్లాట్ ఫామే. శాటిలైట్ హక్కుల్ని మించి మంచి రేటు ఇచ్చి కొత్త సినిమాలను కొని అది స్ట్రీమ్ చేసింది. బాలీవుడ్ తర్వాత ఆ సంస్థ ఎక్కువ పెట్టుబడులు పెట్టింది, క్రేజీ సినిమాలను కొంది తెలుగు లోనే. పెద్ద సినిమాలకు రూ.20 కోట్లకు మించి కూడా రేటు పెట్టిన సందర్భాలున్నాయి. అలాగే లాక్ డౌన్ కాలం లో వివిధ భాషల్లో కొత్త సినిమాలను నేరుగా రిలీజ్ చేసే విషయంలోనూ అమేజాన్ దూకుడుగా వ్యవహరించింది. కానీ ఆ సంస్థ అలా రిలీజ్ చేసిన వాటిలో చాలా వరకు నిరాశ పరిచినవే. అందు లోనూ తెలుగు విషయానికి వస్తే అమేజాన్ వాళ్లు బెంబే లెత్తిపోయేలా ఫలితాలు వచ్చాయి.

‘వి’ సినిమా మీద రూ.32 కోట్లు, ‘నిశ్శబ్దం’ మీద రూ.25 కోట్లు పెట్టుబడి పెట్టి రిలీజ్ చేసింది అమేజాన్ ప్రైమ్. వాటికి వచ్చిన టాక్‌ను బట్టి చూస్తే ఈ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే ఈ పెట్టుబడిలో సగం కూడా షేర్ వచ్చేదా అంటే సందేహమే. మరి అమేజాన్‌కు నేరుగా ఏమేర ప్రయోజనం జరిగి ఉంటుందో అంచనా వేయొచ్చు. ఈ సినిమాల వల్ల కొత్త సబ్‌స్క్రిప్షన్లు ఆశించిన స్థాయిలో వచ్చి ఉండే అవకాశమే లేదు. ఈ పెట్టుబడికి తోడు పబ్లిసిటీ కోసం కూడా కొంత ఖర్చు చేసిన అమేజాన్‌.. చివరికి తమకు దక్కిన లాభం ఏంటని చూసుకుని కచ్చితంగా చింతిస్తూనే ఉంటుంది.

థియేటర్లలో రిలీజ్ చేస్తే డిజాస్టర్లయ్యే సినిమాలను తమకు అంటగట్టి నిర్మాతలు బాగుపడ్డారనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమేజాన్‌ తో పాటు మిగతా ఓటీటీలు కూడా పునరాలోచనలో పడే పరిస్థితి వస్తోంది. ఇలాంటి విషయం లేని సినిమాలను భారీ రేట్లకు ఓటీటీలకు అంటగట్టి చేజేతులా ఈ ఆదాయ వనరును టాలీవుడ్ దెబ్బ తీసుకుంటోందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.