Begin typing your search above and press return to search.

అమేజాన్‌ తో వచ్చేది ఇక్కడ పోతోందిగా..!

By:  Tupaki Desk   |   12 Oct 2019 2:27 PM GMT
అమేజాన్‌ తో వచ్చేది ఇక్కడ పోతోందిగా..!
X
అమేజాన్ ప్రైమ్ వల్ల లాభమో నష్టమో అర్థం కాని అయోమయ స్థితిలోకి వెళ్లిపోతున్నారు టాలీవుడ్ నిర్మాతలు. కొత్తగా డిజిటల్ రైట్స్ రూపంలో ఆదాయ వనరు దొరికిందని సంబరపడిపోయి ముందు వెనుక చూడకుండా హక్కులు అమ్మేస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత డిజిటల్ మీడియంలో సినిమా విడుదల చేయడానికి కనీసం 50 రోజుల గడువు ఉండాలన్న అనధికారిక నిబంధనను అందరూ పాటించడం లేదు. నెల తిరక్కుండానే సినిమా ఆన్ లైన్ లోకి వచ్చేస్తోంది. దీంతో ప్రేక్షకులు నెమ్మదిగా థియేటర్లకు రావడం తగ్గించేస్తున్నారు. వీకెండ్లో సినిమా చూస్తే చూసినట్లు. లేదంటే ఇంకో మూడు వారాలు ఆగితే ప్రైమ్‌ లో చూసుకోవచ్చనే ఆలోచనకు ప్రేక్షకులు వెళ్లిపోతుండటంతో వీకెండ్ తర్వాత వసూళ్లు ఒక్కసారిగా పడిపోతున్నాయి. ముఖ్యంగా యుఎస్‌ లో ఈ ట్రెండ్ బాగా కనిపిస్తోంది. 20-25 డాలర్లు పెట్టి ఒక సినిమా ప్రిమియర్ చూసే బదులు అందులో సగం పెడితే ఒక ఏడాది ప్రైమ్ మెంబర్ షిప్ వస్తుండటంతో అక్కడి ప్రేక్షకుల ఆలోచన మారిపోతోంది.

ఇంతకుముందులా లాంగ్ రన్ అసలే ఉండట్లేదు. ఈ నేపథ్యంలో ఎంత మంచి టాక్ వచ్చినా సినిమాలకు బ్రేక్ ఈవెన్ కావట్లేదు. యుఎస్‌లో ఈ ఏడాది ‘ఎఫ్-2’ మినహా ఏ పెద్ద సినిమా కూడా లాభాలు అందించలేదు. దీంతో నెమ్మదిగా అక్కడ రేట్లు పడిపోతున్నాయి. ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు పలికిన రేటులో ఇప్పుడు 40-50 శాతం తగ్గించి అడుగుతుండటం గమనార్హం. మహేష్ బాబు సినిమాకు ఒక దశలో రూ.20 కోట్లకు పైనే రేటు పలికింది. కానీ ఇప్పుడు 12-13 కోట్లకు మించి ధర రావట్లేదు. అతడి కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ దాదాపుగా ఈ రేటుకే అమ్ముడైనట్లు తెలుస్తోంది. మిగతా పెద్ద సినిమాల పరిస్థితి కూడా అంతే. అమేజాన్ ప్రైమ్‌కు డిజిటల్ హక్కులు అమ్మడం ద్వారా ఒక పది కోట్లు వస్తున్నాయనుకుంటే.. ఆ మొత్తం యుఎస్ హక్కుల రేటు తగ్గుదలతో పోతోంది. మున్ముందు అమేజాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాల అమ్మకాలపైనా ప్రభావం చూపితే ఆశ్చర్యం లేదు.