Begin typing your search above and press return to search.

ఒక్క సినిమా ఎందర్ని ముంచిందో..

By:  Tupaki Desk   |   19 Nov 2018 5:30 PM GMT
ఒక్క సినిమా ఎందర్ని ముంచిందో..
X
ఒక సినిమా ఫలితమేంటో తెలియాలంటే వారాంతం వరకు ఆగాలి. కానీ కొన్ని సినిమాల విషయంలో మాత్రం అంత వరకు వెయిట్ చేయాల్సిన పని ఉండదు. తొలి రోజే సినిమా జాతకం తేలిపోతుంది. ‘అమర్ అక్బర్ ఆంటోని’ ఆ టైపు సినిమానే. ఈ చిత్రం ఫలితమేంటో శుక్రవారం మధ్యాహ్నమే తేలిపోయింది. మూడు భారీ డిజాస్టర్ల తర్వాత శ్రీను వైట్ల తీసిన ఈ చిత్రంపై ముందే అంచనాలు తక్కువగా ఉన్నాయి. దీనికి తోడు బ్యాడ్ టాక్ రావడంతో రెండో రోజుకే సినిమా దబేల్ మని పడింది. వసూళ్లలో బాగా డ్రాప్ కనిపించింది. సిినిమా డిజాస్టర్ అని వీకెండ్ కంటే ముందే తేలిపోయింది. ఈ చిత్రంపై ఆశలు పెట్టుకున్న వాళ్లందరికీ పెద్ద షాక్ తప్పలేదు.

‘అమర్ అక్బర్ ఆంటోని’ టీంలో కీలక సభ్యులందరికీ ఈ చిత్రం హిట్టవడం చాలా అవసరం. ముఖ్యంగా శ్రీను వైట్ల ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇది ఆడకుంటే అతడికి ఇంకో సినిమా రావడం కష్టం. గత మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ అయినా పెద్ద కాంబినేషన్లో అతడికి సినిమా సెట్టవడం ఆశ్చర్యమే. కానీ ఈ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేదు దీంతో వైట్ల కెరీర్ ప్రమాదంలో పడింది. ఇక హీరో రవితేజ పరిస్థితి కూడా భిన్నంగా లేదు. అసలే వరుస ఫ్లాపుల్లో కొట్టుమిట్టాడుతూ మార్కెట్ బాగా దెబ్బ తీసుకున్నాడు. ఇలాంటి టైంలో వైట్లతో సినిమా చేసే సాహసం చేశాడు. అందుకు మూల్యం చెల్లించుకున్నాడు. మాస్ రాజా మార్కెట్ మరింత దెబ్బ తినేసింది ఈ చిత్రంతో. ఇక ఆరేళ్ల విరామం తర్వాత తెలుగులో సినిమా చేసిన ఇలియానాకూ చేదు అనుభవం తప్పలేదు. రీఎంట్రీలో డిజాస్టర్ ఎదురవడంతో ఇక ఇక్కడ ఆమె కెరీర్ ముందుకు సాగే అవకాశాలు కనిపించడం లేదు. ఇక మూడు బ్లాక్ బస్టర్ల తర్వాత ‘సవ్యసాచి’తో షాక్ తిన్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారనుకుంటే ఇంకో డిజాస్టర్ ఖాతాలో వేసుకున్నారు. మొత్తంగా వీళ్లందరి ఆశల్ని ‘అమర్ అక్బర్ ఆంటోని’ తుంచేసింది.