Begin typing your search above and press return to search.

అమలాపాల్ కొత్త అవతారం

By:  Tupaki Desk   |   16 July 2015 5:12 AM GMT
అమలాపాల్ కొత్త అవతారం
X
అమలాపాల్.. ఒకప్పుడు తమిళనాడులోని మహిళలంతా ఈ పేరు చెబితే ఆగ్రహంతో ఊగిపోయేవాళ్లు. కొడుకును పెళ్లి చేసుకుని తండ్రితో సంసారం చేసే కథతో ఆమె చేసిన తొలి కోలీవుడ్ సినిమా తమిళనాట పెద్ద సంచలనం. అప్పటికి ఆమె వయసు 17 ఏళ్లే. అమలకు వ్యతిరేకంగా తమిళనాడంతటా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆమె కనిపిస్తే కొట్టే పరిస్థితి కూడా కనిపించింది. అరంగేట్రంలో అంత చెడ్డ పేరు తెచ్చుకున్న అమల.. ఆ తర్వాత మంచి సినిమాలతో తనను తిట్టిన వాళ్ల నుంచే ప్రశంసలు అందుకుంది. హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ సంపాదించడమే కాదు.. ఎ.ఎల్.విజయ్ లాంటి పెద్ద డైరెక్టర్‌ను పెళ్లాడి తన స్టేటస్ మరింత పెంచుకుంది. ఇప్పుడు ఒక లెజెండరీ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాతో నిర్మాతగానూ మారబోతోంది.

జాతీయ అవార్డు సినిమా ‘కాంజీవరం’చూసినవాళ్లెవరూ అందులో ప్రియదర్శన్ దర్శకత్వ ప్రతిభను, ప్రకాష్ రాజ్ నట విశ్వరూపాన్ని అంత సులభంగా మరిచిపోలేరు. ఈ కాంబినేషన్ మరోసారి తెరమీదికి వస్తోంది. ఈ సినిమాకు అమలాపాలే నిర్మాత కావడం విశేషం. భార్య కోసం ‘థింక్ బిగ్ స్టూడియోస్’ అనే సంస్థను ఆరంభించి.. ప్రకాష్ రాజ్, ప్రియదర్శన్‌ కాంబినేషన్లో సినిమాకు తెరతీశాడు విజయ్. ఈ చిత్రానికి సంతోష్ శివన్ (సినిమాటోగ్రఫీ), సాబు సిరిల్ (ప్రొడక్షన్ డిజైన్) లాంటి అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్స్ పని చేస్తుండటం విశేషం. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా ఎయిడ్స్ నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. విజయ్ ఒకప్పుడు ప్రియదర్శన్‌ దగ్గర అసిస్టెంట్‌గా పని చేయడం విశేషం.