Begin typing your search above and press return to search.

ఎలా మునిగిపోయాడో చెప్పిన ఎ.ఎం.రత్నం

By:  Tupaki Desk   |   15 Aug 2016 7:30 PM GMT
ఎలా మునిగిపోయాడో చెప్పిన ఎ.ఎం.రత్నం
X
ఎ.ఎం.రత్నం.. ఒకప్పుడు తమిళ-తెలుగు భాషల్లో టాప్ ప్రొడ్యూసర్. శ్రీ సూర్య మూవీస్ బేనర్ మీద భారీ సినిమాలు నిర్మించాడు రత్నం. ముఖ్యంగా శంకర్ దర్శకత్వంలో ఆయన చేసిన సినిమాలన్నీ సంచలనం సృష్టించాయి. ఐతే అప్పట్లో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రత్నం.. ఉన్నట్లుండి డౌన్ అయిపోయాడు. ఓ దశలో సినిమాలే మానేశాడు. ఈ మధ్య మూడేళ్ల నుంచి మళ్లీ తమిళంలో సినిమాలు నిర్మిస్తూ తన ఉనికిని చాటుకుంటున్నాడు. ఐతే ఒకప్పుడు టాప్ లెవెల్లో ఉండి.. సినిమాలే తీయలేని పరిస్థితికి ఎందుకు చేరాల్సి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు రత్నం.

‘‘బాయ్స్..ప్రేమికుల రోజు.. నాయక్.. ఈ మూడు సినిమాల కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్నాను. ‘బాయ్స్’ సినిమా తమిళనాడులో తప్ప ప్రపంచం మొత్తం హిట్. ఆ సినిమాలో కుర్రాళ్లు ఓ వేశ్యని ఇంటికి తీసుకొస్తారు. అక్కడ మరీ ఇబ్బందికరమైన సన్నివేశాలేమీ ఉండవు. అయినప్పటికీ శంకర్.. రత్నం ఇలాంటి సన్నివేశాలున్న సినిమా తీస్తారా అంటూ చెన్నైలో ఎవరో కాంట్రవర్శీ మొదలుపెట్టారు. దీంతో సినిమా దెబ్బతింది. దానికి ముందు ‘ప్రేమికుల రోజు’ సినిమాకు కూడా డబ్బులు పోయాయ్. తర్వాత హిందీలో తీసిన ‘ఒకే ఒక్కడు’ రీమేక్ ‘నాయక్’ మరింత పెద్ద దెబ్బ కొట్టింది. ఇంతవరకూ ఏ హిందీ సినిమా ప్రసారం కానన్ని సార్లు ఈ సినిమా టెలికాస్ట్ అయింది. కానీ అప్పటి మార్కెట్ సరిగా లేకపోవడంతో సినిమా కమర్షియల్‌ గా వర్కవుట్ కాలేదు. ఆ రోజుల్లో ఈ మూడు సినిమాలకు కలిపి రూ.65 కోట్లు ఖర్చు పెట్టా. ఒకసారి కింద పడ్డాక.. మళ్లీ మళ్లీ అలాగే జరిగితే తేరుకోవడం కష్టమవుతుంది. ఆ తర్వాత కూడా తమిళంలో నేను సూపర్ హిట్ సినిమాలు చేసినా పుంజుకోవడం కష్టమైంది’’ అని రత్నం చెప్పాడు. అంతా బాగానే ఉంది కానీ.. తన కొడుకుల సినిమాల మీద పెట్టుబడి పెట్టి భారీ నష్టాలు చవిచూసిన విషయాన్ని మాత్రం రత్నం దాచేయడమే విడ్డూరం.