Begin typing your search above and press return to search.

అప్పటికే స్టార్ హీరోయిన్.. ఆ సినిమాకు పారితోషికం రూ.11 మాత్రమే

By:  Tupaki Desk   |   6 May 2022 11:30 PM GMT
అప్పటికే స్టార్ హీరోయిన్.. ఆ సినిమాకు పారితోషికం రూ.11 మాత్రమే
X
చిత్ర పరిశ్రమ అన్నంతనే అంతా కమర్షియల్ గా ఉంటారండి. అక్కడి వారితో ఏం మాట్లాడినా అంతా వ్యాపారమే తప్పించి మరొకటి ఉండదు. ప్రయోజనం ఉంటే ఒకలా.. లేదంటే మరోలా వ్యవహరిస్తారు. అక్కడ ఎవరికి మనసులు ఉండవన్న మాట చాలామంది నోట వింటుంటాం. కానీ.. ఆ వాదనలో నిజం కొంత ఉంటే.. అబద్ధం మరికొంత ఉందని చెప్పాలి. కొన్నిసార్లు అనుకోకుండా బయటకు వచ్చే విషయాలు తెలిసినప్పుడు.. విస్మయానికి గురి కావాల్సిందే. అలాంటి ఉదంతమే ఒకటి తాజాగా బయటకు వచ్చింది.

ప్రముఖ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రీ తాజాగా రాసుకున్న తన ఆత్మకథలో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. రంగదే బసంగి.. ఢిల్లీ 6.. బాగ్ మిల్కా బాగ్ లాంటి భిన్నమైన సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన.. ఒక స్టార్ హీరోయిన్ తో తనకు ఎదురైన అనుభవాన్ని ఆయన వెల్లడించారు. తాను చెప్పే విషయాన్ని చెబితే ఎవరు నమ్మరని పేర్కొన్నారు.

అప్పటికే స్టార్ హీరోయిన్ అయిన ఒక నటి.. తన సినిమాలో పాత్ర కోసం కేవలం రూ.11 మాత్రమే పారితోషికంగా తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ దివాగా కీర్తించే సోనమ్ కపూర్. నాలుగేళ్ల క్రితం వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక.. విషయానికి వస్తే.. ఆయన తీసిన భాగ్ మిల్కా భాగ్ మూవీలో పాత్ర కోసం సోనమ్ కపూర్ ను సంప్రదించారు.

రూ.41 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న ఈ సినిమా లైన్ విన్నంతనే ఆమె ఆనందంగా ఒప్పేసుకున్నారు. పారితోషికం కింద కేవలం రూ.11 మాత్రమే తీసుకున్న ఆమె.. తన పాత్ర కోసం మొత్తం ఏడు రోజులు వెచ్చించారు. ఆ సమయానికి ఆమె మీద తీయాల్సిన అన్ని సన్నివేశాల్ని పూర్తి చేశారు. దేశ విభజన సన్నివేశాల్ని అద్భుతంగా చిత్రీకరించి.. మిల్కా సింగ్ జీవితకథను సినిమాగా నిర్మిస్తున్నందుకు ఆమె తన వంతుగా ఇంత తక్కువ పారితోషికాన్ని తీసుకొని సినిమాకు అండగా నిలిచారు.

ఈ సినిమా విడుదల తర్వాత అనూహ్య విజయాన్ని సొంతం చేసుకోవటం.. కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ సినిమాకు మొత్తంగా రూ.210 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. విమర్శకుల అభినందనల్ని అందుకున్న ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు తాజాగా వెల్లడించిన విషయం గురించి విన్న తర్వాత.. సినిమా వాళ్లకు మనసు లేదని ఎవరు చెప్పారు? అన్న ప్రశ్నను వేయకుండా ఉండలేం.